అమరావతి: ఎలక్షన్ కౌంటింగ్ ప్రకియలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని నూతనంగా ఏర్పాటు చేసుకున్న పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. 

వైఎస్ జగన్ తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతితోపాటు పలువురు తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. 

జగన్ తో సెల్ఫీ దిగేందుకు పోటీ పడ్డారు. సీఎం జగన్ అంటూ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం మార్మోగిపోయింది. అనంతరం నేరుగా ఆయన తాడేపల్లిలోని ఇంటికి చేరుకున్నారు. 

వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఇప్పటికే అమరావతి చేరుకున్నారు. ఇకపోతే వైఎస్ జగన్ ఇంటివద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. 

గురువారం ఎన్నికల ఫలితాలు విడుదల కావడం, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్రం హోంశాఖ జగన్ కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. గురువారం పార్టీకీలక నేతలతో కలిసి వైఎస్ జగన్ ఎన్నికల ఫలితాలను వీక్షించనున్నారు.