జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ వెల్లడించింది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ప్లీనరీని నిర్వహిస్తామని తెలిపింది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (ysr congress party) అలర్ట్ అయ్యింది. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులతో బస్సు యాత్ర నిర్వహించిన వైసీపీ.. తాజాగా ప్లీనరీకి (YSRCP Plenary) రెడీ అయ్యింది. జూలై 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ వెల్లడించింది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (acharya nagarjuna university) సమీపంలో ప్లీనరీని నిర్వహిస్తామని తెలిపింది.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 27న తాడేపల్లిలోకి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకువెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. వచ్చే రెండేళ్లలో ప్రజల్లోకి ఏవిధంగా వెళ్లడం, 170కి తక్కువ కాకుండా ఎలా సీట్లు సాధించడం అనే అంశంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
వైసీపీ నేతలందరూ ప్రజల్లోనే ఉండాలని ఈ సమావేశంలో జగన్ కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లేలా మంత్రులు, జిల్లా అధ్యక్షులు చర్యలు తీసుకోవాలని సూచించిన జగన్.. సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రయోజనాలు తెలుసుకునేల ప్రణాళికలు తయారుచేయాలని పార్టీ బాధ్యులను ఆదేశించారు. త్వరలో జిల్లాల్లో సీఎం జగన్ పర్యటనలు వుండే అవకాశం వుంది.
