గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరుగుతుంది. వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరుగుతుంది. వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ప్లీనరీలో తొలి రోజు నాలుగు తీర్మానాలు చేసిన వైసీపీ.. నేడు సామాజిక న్యాయం, పారదర్శక పాలన, వ్యవసాయ రంగం, దుష్ట చతుష్టయంపై తీర్మానాలు చేయనుంది. అలాగే వైసీపీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు శుక్రవారం వైసీపీ ప్లీనరీ వేదికగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటన చేశారు. శనివారం సాయంత్రం అద్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్టుగా చెప్పారు. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగానికి కొన్ని సవరణలు చేయనున్నారు.
ఇక, వైఎస్ జగన్‌ను వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా మార్చేందుకు వీలుగా సవరణ చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్.. ప్లీనరీలో ముగింపు ఉపన్యాసం చేయనున్నారు. అయితే వైఎస్ జగన్ తన స్పీచ్‌లో ఏం చెప్పబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసేలా సీఎం జగన్ భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు.
ఇక, శుక్రవారం వైసీపీ ప్లీనరీని ప్రారంభించిన జగన్.. ప్రారంభోన్యాసం చేశారు. టీడీపీ అధ్యక్షుడుచంద్రబాబుకు దుష్ట చతుష్టయం అండగా నిలిచిందని విమర్శించారు. చంద్రబాబుకు దుష్టచతుష్టయంగా ఉన్న ఎల్లో మీడియా తో పాటు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ కూడా కలిశాడని జగన్ విమర్శించారు. ‘‘మనం మాత్రం జనం ఇంట ఉన్నాం. జనం గుండెల్లో ఉన్నాం. గజదొంగల ముఠా మాత్రం ఎల్లో టీవీలలో మాత్రమే ఉంది. ఎల్లో పేపర్లలో, ఎల్లో సోషల్ మీడియాలో మాత్రమే ఉంది. వారికి మనకీ పోలిక ఎక్కడ? మన చేతల పాలనకు, వారి చేతగాని పాలనకూ మధ్య పోటీనా ? మన నిజాలకు వారి అబద్దాలకు మధ్య పోటీనా ? మన నిజాయితీకి వారి వంచనకు మధ్య పోటీనా?’’ అని ప్రశ్నించారు.
ప్రజా జీవితంలో మంచి చేసిన చరిత్ర లేని చంద్రబాబు మంచి చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. అందుకే రాష్ట్రంలో కులాల కుంపట్లు, మతాల మంటలు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. పచ్చి అబద్దాలతో రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. గజదొంగల ముఠాను, ఎల్లో మీడియా రాతలను, పైచాశిక మాటలకు ఇంటింటికి తిరిగి సమాధానం ఇవ్వనున్నట్టుగా జగన్ చెప్పారు. మూడేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క స్కీమైనా ఉందా అని జగన్ ప్రశ్నించారు.
