Asianet News TeluguAsianet News Telugu

టీడీపీని వీడుతున్న నేతలు: చంద్రబాబుపై జగన్ వ్యూహమిదే

 కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకొని  వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది.   

ysrcp plans to attract kapu leaders from tdp
Author
Amaravathi, First Published Feb 14, 2019, 5:48 PM IST

అమరాతి: కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను లక్ష్యంగా చేసుకొని  వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌ను ప్రారంభించింది.   కాపు సామాజిక వర్గం ఏపీ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో గెలుపు ఓటములపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఒకే సామాజిక వర్గానికి బాబు ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.

ఏపీ రాష్ట్రంలో  రాజకీయ వాతావరణం వేడేక్కింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో  రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నుండి నేతల వలసలు ప్రారంభమయ్యాయి. ఒక్క పార్టీ నుండి మరో పార్టీలోకి వలసలు చోటు చేసుకొన్నాయి.

తాజాగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందు గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ రావు, రమేష్ బాబుతో పాటు మరో ఇద్దరు నేతలు టీడీపీలో చేరారు. ఆ సమయంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వీరంతా కూడ కాపు సామాజిక వర్గానికి చెందినవారు.

ఆ ఎన్నికల సమయంలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు తన కారులో గంటా శ్రీనివాసరావు సహా వీరిని హైద్రాబాద్‌లోని చంద్రబాబునాయుడు ఇంటికి తీసుకొచ్చారు. ఆ సమయంలో గంటా శ్రీనివాస్ రావు మంత్రిగా ఉన్నారు.

కాపు సామాజిక వర్గానికి చెందిన  అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా బాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మరో వైపు మరికొందరు కాపు నేతలు కూడ టీడీపీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం సాగుతోంది.

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  ఇటీవల టీడీపీకి చెందిన  రామచంద్రాపురానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుతో భేటీ అయ్యారు.

తోట త్రిమూర్తులు కూడ టీడీపీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. తన కొడుకు పెళ్లి వేడుక పూర్తైన తర్వాత తోట త్రిమూర్తులు టీడీపీకి గుడ్‌బై చెబుతారనే ప్రచారం సాగుతోంది. కానీ, ఆమంచి కృష్ణమోహన్ తోట త్రిమూర్తులుతో భేటీ కావడం మాత్రం రాజకీయ వర్గాల్లో మాత్రం ప్రాధాన్యత సంతరించుకొంది.

విశాఖ జిల్లాకు చెందిన మరో కాపు సామాజిక వర్గానికి చెందిన రమేష్ బాబు కూడ టీడీపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. కొంత కాలంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పంచకర్ల రమేష్ బాబు మధ్య దూరం పెరిగింది. అయితే ఇటీవల కాలంలో పంచకర్ల రమేష్ బాబు గంటాతో  కలిసినట్టుగా కూడ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వీరి మధ్య అభిప్రాయబేధాలు తొలిగినట్టుగా చెబుతున్నారు.

గత ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో  టీడీపీకి ఎక్కువ సీట్లు దక్కాయి.  అయితే కాపు సామాజిక వర్గం నేతలు టీడీపీకి గుడ్ బై చెబితే ఆ ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు  ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీ అవంతి శ్రీనివాస్ టీడీపీకి గుడ్ బై చెప్పడం రాజకీయంగా వైసీపీకి కలిసొచ్చే అవకాశంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

విశాఖ జిల్లాలో వైసీపీ బలహీనంగా ఉంది, అవంతి శ్రీనివాస్ లాంటి నేతలు పార్టీలో చేరడం వల్ల వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కలుగుతోందని  ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో టీడీపీలో చేరారు.

అయితే త్వరలో ఎన్నికలు జరగనున్నందున ఇంకా చాలా మంది నేతలు వైసీపీలో చేరనున్నారని అవంతి శ్రీనివాస్ చెప్పడం రాజకీయంగా టీడీపీ నేతలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాపు సామాజిక వర్గం ఓట్లు రాష్ట్రంలోని కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా  పార్టీలు, అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావం చూపించనున్నాయి.


మరో వైపు చంద్రబాబునాయుడు ఏపీలో ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ చీఫ్ జగన్ విమర్శలు చేశారు. ఇటీవల కాలంలో  సీఈసీని కలిసి వచ్చిన తర్వాత పోలీసు అధికారుల నియామాకాల్లో ఒకే సామాజిక వర్గానికి చంద్రబాబునాయుడు ప్రాధాన్యత ఇచ్చారని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే సామాజిక వర్గానికి బాబు ప్రాధాన్యత ఇచ్చాడని వైసీపీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను బాబు సహా టీడీపీ నేతలు ఖండించారు. పార్టీని వీడిన నేతలంతా కూడ ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. 

టీడీపీని వీడిన ఆమంచి కృష్ణమోహన్ తో పాటు అవంతి శ్రీనివాస్ కూడ ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారని కూడ పార్టీని వీడిన నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

అయితే సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తాను విద్యార్థి దశ నుండే సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉన్నానని బాబు చెప్పారు. వ్యూహత్మకంగా  బాబుపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది.
 

 

Follow Us:
Download App:
  • android
  • ios