మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు రాహుల్‌తో జతకట్టలేదా అని ప్రశ్నించారు వైసీపీ ఎంపీలు. గురువారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన వారు టీడీపీ వాళ్లు అందితే జుట్టు, లేదంటే కాళ్లు పట్టుకుంటారని మండిపడ్డారు.

అమిత్ షా కారుపై రాళ్లు వేయించింది మరిచిపోయారా అని వైసీపీ ఎంపీలు నిలదీశారు.  అమిత్ షా వద్ద మాట్లాడిన అంశాలపై మా దగ్గర వీడియోలు వున్నాయని వారు స్పష్టం చేశారు.

ఓటుకు కోట్లు కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. టీడీపీ ఎంపీలు అమిత్ షా వద్ద అబద్ధాలు ప్రస్తావించారని ఆరోపించారు వైసీపీ ఎంపీలు.

కాగా, ఢిల్లీలో బుధవారం అమిత్‌షాను కలిసిన టీడీపీ ఎంపీలు.. రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. వైపీసీ దురాగతాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా ప్రతిపక్ష నేతలు, మీడియాపై కూడా కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశాం.. ప్రతిపక్ష నేతలపై దాడులకు దిగుతున్నారని.. వీటిపై విచారణ జరపాలని కేంద్ర హోంమంత్రిని కోరామని తెలిపారు.