అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్ కూర్పు ఖరారు చేశారు. వైయస్ జగన్ రూపొందించిన మంత్రుల జాబితాను అందుకున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక్కొక్కరికీ ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు. 

జగన్ కేబినెట్ లో బెర్త్ కన్ఫమ్ చేసుకున్న వారికి విడతల వారీగా ఫోన్లు చేస్తున్నారు విజయసాయిరెడ్డి. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని ఫోన్ చేసిన విజయసాయిరెడ్డి తాజాగా మరో నలుగురికి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకోవాలంటూ స్పష్టం చేస్తున్నారు. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే,మాజీమంత్రి కొలుసు పార్థసారధిలకు ఫోన్ చేశారు. 

శనివారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇకపోతే అంతకుముందు విజయసాయిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, మేకతోటి సుచరితలకు ఫోన్ చేశారు. 

నలుగురికీ శనివారం జరగబోయే ప్రమాణ స్వీకారానికి సిద్ధం కావాలని విజయసాయి రెడ్డి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా 17 మందికి విజయసాయిరెడ్డి ఫోన్ చేయనున్నారు. సాయంత్రం 4.25గంటలకు గవర్నర్ నరసింహన్ ను ముఖ్యమంత్రితోపాటు కలవనున్న విజయసాయిరెడ్డి అనంతరం మిగిలిన 17 మందికి ఫోన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జగన్ కేబినెట్ లో 25 మందికి అవకాశం ఇచ్చారు. వారిలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు సీఎం జగన్.