తెలంగాణ ఎన్నికల బరిలోంచి ఔట్ .. ఇది టీడీపీ పతనానికి నాంది, 2024లో ఏపీలోనూ నిష్క్రమణే : విజయసాయిరెడ్డి
టీడీపీ తెలంగాణలో అసలు ఎక్కడా పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం 1982 తర్వాత ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి . 2024 ఎన్నికల్లో ఓడిపోయాక ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పూర్తిగా నిష్క్రమిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు జైల్లో వున్న కాలంలో పార్టీ పూర్తిగా పడకేసింది. నేతలు ఇళ్లకే పరిమితం కాగా.. కేడర్ పూర్తిగా స్తబ్ధుగా మారింది. లోకేష్ ఢిల్లీలో కేసులు, న్యాయ పోరాటం ఇతర అంశాలను చూస్తూ బిజీగా వుండిపోయారు. దీంతో చంద్రబాబు లేని టీడీపీ పరిస్ధితి ఇది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది తెలుగుదేశం శ్రేణుల భవిష్యత్తుపైనా ఆందోళనకు దారి తీసింది.
మరోవైపు.. ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. ఖమ్మంలో నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ కావడం, టీటీడీపీ అధ్యక్షుడిగా వ్యవహరించిన కాసాని జ్ఞానేశ్వర్ చురుగ్గా కార్యకలాపాలు కొనసాగించడంతో తెలుగుదేశం తెలంగాణలో యాక్టీవ్ అయ్యారు. ఇంతలో చంద్రబాబు జైలుకు వెళ్లడంతో అక్కడా నేతలు సైలెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును కలిసిన కాసానికి తెలంగాణలో పోటీ చేయడం లేదని జైల్లో బాబు చెప్పారు. ఈ విషయాన్ని నేతలకు చెప్పిన కాసాని.. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ వెంటనే టీటీడీపీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు.
ఈ పరిణామాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ తెలంగాణలో అసలు ఎక్కడా పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం 1982 తర్వాత ఇదే మొదటిసారని వ్యాఖ్యానించారు. టీడీపీ పతనానికి ఇది ప్రారంభం మాత్రమేనని.. తన అంచనా ప్రకారం 2024 ఎన్నికల్లో ఓడిపోయాక ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పూర్తిగా నిష్క్రమిస్తుందని విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.