అమరావతి:వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ చీఫ్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ లో చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. 

విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీకేజీతో మరణించిన  బాధితులకు భారీగా ఆర్ధిక సహాయం చేస్తానని ప్రకటించిన చంద్రబాబునాయుడు గ్యాస్ బాధితులను పరామర్శించకుండా కరకట్ట నుండి కదలడం లేదని ఆయన విమర్శించారు. విశాఖకు వెళ్లకుండా ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకొనే పనిలో పడ్డాడని ఆయన చెప్పారు.

అధికారం పోయినా కూడ పార్టీని వీడకుండా ఉండాలని ఆయన పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులకు కోట్లాది రూపాయాల డబ్బులను ఆశ చూపిస్తున్నాడని విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఆశ చూపడమంటే అధికారంలో ఉన్న సమయంలో ఎంత మొత్తంలో డబ్బులను దోచుకొన్నాడో అర్ధమౌతోందన్నారు.

టీడీపీ మహానాడు నిర్వహించడంపై కూడ విజయసాయిరెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇంకెక్కడి తెలుగుదేశం ప్రజలకు దూరమై ఏడాదైందన్నారు. ఎల్లో మీడియా ఆ పార్టీ వెబ్ సైట్లలో మాత్రమే తరచూ ఉరుములు వినిపిస్తుంటాయని ఆయన ఎద్దేవా చేశారు.

టీడీపీకి క్యాడర్ లేదు, ఓటు బ్యాంకు లేదన్నారు.అధికారం ఉంటేనే మాట్లాడతారంట, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వంపై అనుకూల, వ్యవస్థలను ఉసిగొల్పితే  ప్రజా క్షేత్రంలో విజయం సిద్దిస్తుందా అని ఆయన ప్రశ్నించారు.ఇవాళ నుండి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.