వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ షాకిచ్చారు. రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్ నుంచి విజయసాయిరెడ్డిని తొలగించారు. 

రాజ్యసభ ప్యానెల్ ఛైర్మన్ నియామకాల్లో మార్పులు చేర్పులు చేశారు ఉపరాష్ట్రపతి జగదీప్. ఈ మేరకు బుధవారం నూతన ప్యానెల్ వైస్ ఛైర్మన జాబితాను ప్రకటించారు. జాబితా నుంచి వందనా చౌహాన్, విజయసాయిరెడ్డి, ఇందుబాల గోస్వామి పేర్లను తొలగించారు. కొత్తగా ప్యానెల్ వైస్ ఛైర్మన్ జాబితాలోకి సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ పేర్లు చేర్చారు రాజ్యసభ ఛైర్మన్. 

ALso Read:భారత పార్లమెంట్‌లో వైసీపీకి దక్కిన అరుదైన గౌరవం.. మార్గాని భరత్ ట్వీట్ వైరల్

మంగళవారం మొత్తం 8 మందితో రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌ను ప్రకటించారు. అయితే నేడు రాజ్యసభలో ప్యానెల్ సభ్యుల జాబితాను వెల్లడిస్తూ ఏడుగురి పేర్లే చదివారు. అందులో విజయసాయి పేరు లేకపోవడం గమనార్హం. అయితే దీనికి కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఒక్కరోజు వ్యవధిలో ఏం జరిగిందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో డాక్టర్ ఎల్ హనుమంతయ్య, భుభనేశ్వర్ కలిటా, సురేంద్ర సింగ్ నాగర్, తిరుచ్చి శివ, సుఖేందు శేఖర్ రే, డాక్టర్ శస్మిత్ పాత్రా, సరోజ్ పాండేలు స్థానం సంపాదించారు.