సింహంతో పోటీకి తోడేళ్ల గుంపు రెడీ అవుతోంది..: టిడిపి, జనసేన పొత్తుపై విజయసాయి రెడ్డి
రాబోయే ఎన్నికల్లో టిడిపి, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తాయంటూ పవన్ కల్యాణ్ ప్రకటనపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం రాబోయే ఎన్నికల్లో జనసేన, టిడిపి కలిసి పోటీచేస్తాయన్న పవన్ కల్యాణ్ ప్రకటన పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. 2014 ఎన్నికల్లో మాదిరిగాlo 2024లో కూడా బిజెపి, టిడిపి, జనసేన కలిసి పోటీచేయడానికి రంగం సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో అధికార వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.
''2024 లో ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఎన్నికలు టిడిపి వర్సెస్ వైసిపిగా వుండనుంది. ఇది తోడేళ్ల గుంపు సింహంతో తలపడినట్లు వుండనుంది. అధికారం కోసం దురాశపడేవారికి, ప్రజా సంక్సేమం కోసం పాటుపడే వారికి మద్య ఈ ఎన్నిక జరగనుంది. యూ టర్న్ రాజకీయాలు వర్సెస్ విశ్వసనీయత, అస్థిరత వర్సెస్ స్థిరత్వం, అవకాశవాదం వర్సెస్ నిజాయితీ, కుల రాజకీయాలు వర్సెస్ ఐకమత్యం, క్రోనీ క్యాపిటలిసమ్ వర్సెస్ అందరి ప్రయోజనాలకు మద్య రాబోయే ఎన్నికల్లో పోటీ వుండనుంది. మొత్తంగా చెప్పాలంటే అన్ని ప్రతిపక్షాల పార్టీలు వర్సెస్ ప్రజాపక్షాన నిలబడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్య ఎన్నికలు జరగనున్నాయి'' అంటే ఎక్స్(ట్విట్టర్) వేదికన స్పందించారు విజయసాయిరెడ్డి.
ఇదిలావుంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం చంద్రబాబును సిఐడి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఏసిబి కోర్టు ఆయన రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో వుంచారు. అయితే జైలు అధికారులు చంద్రబాబుకు ఖైధీ నెంబర్ 7691 కేటాయించారు.ఈ నెంబర్ పైనా విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Read More టీడీపీ-జనసేన పొత్తు.. పవన్ కల్యాణ్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ నెంబర్ 7691 ను కూడితే 23 వస్తుందని... ఇది 2023ఆయనకు చవరి ఏడాది అనేదాన్ని సూచిస్తుందని అన్నారు. అంటే 2024లో చంద్రబాబు రాజకీయాల్లో కనిపించరనే సంకేతం ఈ ఖైదీ నెంబర్ ద్వారా వెలువడిందని విజయసాయి అన్నారు. గతంలో ఎన్టీఆర్ ను వెన్నుపొడిచి అధికారాన్ని లాక్కోడమే కాదు కొడుకులు, కూతుళ్లను కూడా చంద్రబాబు దూరం చేసారని విజయసాయి అన్నారు. ఇలా అన్నీ దూరమై ఎన్టీఆర్ ఎంతటి మనోవేదనను అనుభవించారో ఇప్పుడు చంద్రబాబుకు అర్థమై వుంటుందన్నారు. మనం ఎలాంటి పనులు చేస్తామో అలాంటి ఫలితమే వస్తుందంటూ చంద్రబాబుకు జైలు శిక్షపై విజయసాయి రెడ్డి సెటైర్లు వేసారు.