ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్- ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో వుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్- ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగుతెరను శాసిస్తున్న రెండు పెద్ద కుటుంబాలకు చెందిన ఇద్దరు స్టార్స్ తొలిసారిగా కలిసి నటిస్తుండటంతో దీనికి ఎక్కడా లేని హైప్ వచ్చింది. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లను సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ బరిలో వున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్‌కు చెందిన మ్యేగజైన్ ‘వెరైటీ’ ఇటీవల ఆర్ఆర్ఆర్‌ను ఆకాశానికెత్తేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గీతం కేటగిరీల్లో ఆర్ఆర్ఆర్ పోటీపడొచ్చని మ్యేగజైన్ అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఆస్కార్ నామినేషన్లపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని ఆకాంక్షించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఆస్కార్ బరిలో వున్నారంటే అది తెలుగు చిత్ర స్థాయి సత్తాను చాటి చెబుతుందన్నారు.
ఎన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫామెన్స్ ‘ఆర్ఆర్ఆర్’లో అద్భుతమనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా వీరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఏకంగా హాలీవుడ్ దర్శకుడు, రచయితలు, స్టార్స్ కూడా ఈ మూవీ గొప్పదంటూ తమదైన శైలిలో రివ్యూలు ఇచ్చాడు. ముఖ్యంగా మూవీలో కొన్ని ఎలివేషన్ షాట్స్, వీఎఫ్ఎక్స్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంట్రీ సీన్లు, ఇంటర్వెల్ షాట్ ఆడియెన్స్ కు ఎప్పటి గుర్తుండిపోయేలా చేశాయి. ముఖ్యంగా చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని రామ్ చరణ్, ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ తో ఇరగదీశారు. ఇందుకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఆయన పేరు ప్రముఖ మీడియా సంస్థ ‘వెరైటీ’ లిస్టులో ఇప్పటికే చేరింది. కాగా, తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ రామ్ చరణ్ కూడా ఆస్కార్ బరిలో నిలిచారు.
మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ తేజ్ పేరును కూడా ‘వెరైటీ’ సంస్థ రీసెంట్ గా అప్డేట్ అయిన లిస్టులో చేర్చింది. 35వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండగా, 36వ స్థానం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు చేరింది. ఈ సందర్భంగా చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో రామ్ చరణ్ పేరు ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు. #RamCharanForOscars అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. చరణ్, తారక్ అభిమానులు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాల లిస్టులో ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ (Oscar) అవార్డు కూడా రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ డిమాండ్ చేస్తున్నారు.
