అమరావతి: ఒకప్పుడు రాజకీయాలు అంటే పార్టీ పరంగానే ఉండేయి. ప్రజల సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చెయ్యడంతోపాటు మాటల దాడికి దిగేవి. కానీ ప్రస్తుత రాజకీయాలు అదుపుతప్పాయి. విమర్శలకు అర్థం పరమార్థం అంటూ ఏమీ లేదు. ఏది దొరికితే అది అస్త్రంగా ప్రయోగించేస్తున్నారు. 

ఇకపోతే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి నారా లోకేష్ కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెట్టిన పేర్లు అన్నీ ఇన్నీ కావు. ఎమ్మెల్యే ఆర్కే రోజా ఒక పేరు పెట్టి హల్ చల్ చేశారు. ఆ నిక్ నేమ్ ఏకంగా చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. 

ఇక తెలుగుదేదం పార్టీ నేతలు అయితే ముద్దుగా చినబాబు అనిపిలుచుకుంటారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో కొత్తపేరు కనిపెట్టారు. అది చిట్టినాయుడు. చిట్టినాయుడు అంటూ తన ట్విట్టర్ వేదిగా విరుచుకుపడ్డారు. 

తెలంగాణాలో కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసెడెంటు అయినప్పటి నుంచి లోకేష్ కు నిద్రం పట్టడం లేదని ట్విట్టర్ ద్వారా విమర్శించారు. తండ్రి అర్జంటుగా తప్పుకుని పార్టీ సిఎం కుర్చీని గాని పార్టీ బాధ్యతలను గాని  తనకప్పగిస్తే బాగుండని కలలు కంటున్నాడని ఆరోపించారు. చంద్రబాబు ఈ విషయంలో కొడుకును కూడా నమ్మడని తెలియదు పాపం చిట్టి నాయుడికి అంటూ సెటైర్ వేశారు ఎంపీ విజయసాయిరెడ్డి.