ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడిన వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.. ఎన్నికల్లో జగన్ విజయం సాధించినప్పటికీ బాబును విడిచిపెట్టడం లేదు. తాజాగా సోమవారం ట్విట్టర్ ద్వారా మరోసారి విరుచుకుపడ్డారు.

జన్మభూమి కమిటీల మాఫియా రాజ్యానికి కాలం చెల్లింది. గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలన్నీ ప్రజల గడప వద్దకు వెళ్తాయి. చంద్రబాబు హయాంలో నేతలు వందల,వేల కోట్లు పోగేసుకున్నారు. పేదల జీవితాలు అస్థవ్యస్తమయ్యాయి. మా సిఎం వచ్చాడు. కళ్లలో పెట్టుకుని కాపడతాడనే భరోసా కనిపిస్తోందిప్పుడు.

ఇక సీబీఐని రాష్ట్రంలో చంద్రబాబు బ్యాన్ చేయగా.. జగన్ దానిని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని ఉద్దేశిస్తూ కూడా విజయసాయి కామెంట్ చేశారు. తానేం చేసినా అడ్డుకోరాదని చంద్రబాబు ఒక ఉద్యమమే చేశారు.

సీబీఐని బ్యాన్ చేశారు. ఐటీ దాడులను అడ్డుకున్నారు. ఈడీ ఎలా వస్తుందని గుడ్లురిమారు. సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ జగన్ గారు ఆదేశాలు జారీ చేశారు. దొంగలను రక్షించేది లేదని తేల్చిచెప్పారు. చూస్తున్నారా చంద్రబాబూ? అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని  పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారు. అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారు. మనం మాత్రం దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలి.

ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకు మాత్రమే అని అర్థం చేసుకోవాలి.  జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలంటూ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.