ప్రతిపక్షనేత , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. శుక్రవారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఎదైనా చేయించుకోగలడని.. ఇప్పుడు చిన్న గులకరాయి వేయించుకోని రాద్దంతం చేస్తున్నాడంటూ ఎద్దేవా  చేశారు.

తిరుపతి ఎన్నికల్లో జనసేన, టిడిపి,బిజెపి పోటీనే కాదంటూ విజయసాయి వ్యాఖ్యానించారు. అచ్చెన్ననాయుడు గురించి మాట్లాడటానికి ఏం లేదని.. 17 తరువాత పార్టీ లేదు, ఏం లేదని తానే చెప్పాదంటూ ఆయన చురకలు వేశారు. 

తిరుపతిలో వైసీపీ విజయం తథ్యమన్న విజయసాయిరెడ్డి... ఎంత మెజారిటీ వస్తుందన్న ప్రశ్న మాత్రమే అందరిలో వుందని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని.. 24 , 25 తేదీల్లో బీచ్ రోడ్డులో ఉన్న కన్వేషన్ సెంటర్ ఇది జరుగుతుందని విజయసాయిరెడ్డి తెలిపారు.

25న విజయనగరం, మే 2 న శ్రీకాకుళం లో జాబ్ మేళా నిర్వహిస్తున్నామని ఎంపీ వెల్లడించారు. 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని... 10వ తరగతి నుంచి పిజి చదివిన వారు అర్హులని విజయసాయిరెడ్డి తెలిపారు.

Also Read:తిరుపతి ఎన్నికలో వైఎస్ వివేకా హత్య ఓ అస్త్రం: వైసీపీ, టీడీపీల దండయాత్ర

24ఏళ్ల వయస్సు నుంచి 38 సంవత్సరాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. కోవిడ్ కారణంగా ముందుగానే దరఖాస్తు తీసుకోని తరువాత ఇంటర్వూలు నిర్వహిస్తారని చెప్పారు.

ఈ జాబ్ మేళాలో 75% మహిళలకు కేటాయిస్తామని.. ఇది ఆరంభం మాత్రమేనని ఇంకా ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. విశాఖకు రాజధాని వస్తుందని.. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు  కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు.

విశాఖలో 740 స్లమ్ ఏరియాలు ఉన్నాయని.. వారికి గృహ సదుపాయం కల్పిస్తామని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. స్లమ్ లేని నగరంగా విశాఖను ఎర్పాటు చేస్తామని.. భోగాపురం ఎయిర్ పోర్ట్, భీమిలి ఆరు లైన్ల రోడ్లు వంటి కార్యక్రమాలకు త్వరలో ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేస్తారని విజయసాయిరెడ్డి ప్రకటించారు.