తెలుగు దేశం పార్టీపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  టీడీపీ ఎన్నారై పార్టీగా తయారయిందన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఉండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పోలవరం పూర్తి కాకుండా పక్క రాష్ట్రాలతో చంద్రబాబు కేసులు వేయించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. పోలవరం భూసేకరణ పూర్తి కాకుండా అడ్డుపడ్డారని.. పోలవరం దగ్గర 150 అడుగుల వైఎస్సార్ విగ్రహం పెడతామంటే చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదని దుయ్యబట్టారు.

2018కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పిన మాటలు ఏమయ్యాయని విజయసాయి రెడ్డి నిలదీశారు. తాము 2021 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

నిమ్మగడ్డ చంద్రబాబు తొత్తుగా మారిపోయారని ఆయన టీడీపీ అధికార ప్రతినిదిగా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నికలు చంద్రబాబు పెట్టమంటే పెడుతున్నారు.. వద్దంటే మానేస్తున్నారని వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ నిబంధనలు నిమ్మగడ్డ తుంగలో తొక్కుతున్నారని.. టీడీపీ నేతలతో స్టార్ హోటల్లో కూర్చొని మంతనాలు జరిపారని విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. కరోనా లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేశారని... కరోనా ఎక్కువుగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజల ఆరోగ్యాన్ని నిమ్మగడ్డ రమేష్ పట్టించుకోవడం లేదని... టీడీపీ క్యాడర్ చంద్రబాబు కంటే నిమ్మగడ్డను ఎక్కుగా నమ్ముతున్నారని విజయసాయి దుయ్యబట్టారు. నిమ్మగడ్డ పదవీ విరమణ తరువాత ఆయనను టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేస్తారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

చంద్రబాబును దింపి టీడీపీ నేతలు నిమ్మగడ్డకు పగ్గాలు అప్పగిస్తారనే అనుమానం కలుగుతుందన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే దేశ చరిత్రలో అడ్డుకున్న పార్టీ ఒక్క టీడీపీ మాత్రమేనని.. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని విజయసాయి మండిపడ్డారు.

విశాఖ ఎయిర్ పోర్ట్ ప్రభుత్వ ఎయిర్‌ పోర్ట్ కాదని నేవి ఎయిర్ పోర్ట్ అన్నారు. ఇక్కడ ల్యాండింగ్, టేక్ ఆఫ్ ఇబ్బందులు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి చిన్న విషయంలో నేవీ అధికారులు ఇబ్బంది పెడుతున్నారని విజయసాయి చెప్పారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చిన తరువాత బేగంపేట ఎయిర్ పోర్ట్ మూసేశారని ఆయన గుర్తుచేశారు. తనకు ఎలాంటి భూ లావాదేవీలతో సంబంధం లేదని.. తన పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తే నాకు లేదా పోలీసులు దృష్టికి తీసుకురావాలని విజయసాయి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రాధాకృష్ణ, రామోజీరావు లాంటి వారు సమతుల్యం పాటించాలని రాధాకృష్ణ ఛానెల్, పేపర్ నడపడానికి అనర్హుడంటూ ఫైరయ్యారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై తనతో చర్చకు వస్తే అన్ని విషయాలు చర్చిస్తానన్నారు.

జర్నలిస్ట్ కానీ జర్నలిస్ట్ రామోజీరావు అయితే జర్నలిజం ముసుగు వేసుకొని ఒక పార్టీకి రాధాకృష్ణ కొమ్ము కాస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గత ప్రభుత్వం ఇచ్చిన లేఖలోనే భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభమైతే విశాఖ ఎయిర్ పోర్ట్ మూసేవేయలని ఉందని ఆయన గుర్తుచేశారు.

విశాఖ ఎయిర్ పోర్ట్‌పై రామోజీరావు, రాధాకృష్ణతో చర్చించాలా అని విజయసాయిరెడ్డి నిలదీశారు. రెండు ఎయిర్ పోర్ట్‌ల మధ్య ఎంత దూరం ఉండాలో తెలియదా.. అంటూ ఆయన ప్రశ్నించారు.