నెల్లూరు: నెల్లూరు రాజకీయాల్లో  త్వరలో  మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయా... టీడీపీకి చెందిన నేతలకు వైసీపీ గాలం వేస్తోందా అంటే అవుననే  రాజకీయ  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దఫా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని  వైసీపీ పావులు  కదుపుతోంది.

నెల్లూరు  రాజకీయాల్లో వైసీపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు గాను టీడీపీ చేస్తున్న ప్రయత్నాలకు  వైసీపీ కూడ చెక్  పెట్టే ప్రయత్నాలను ప్రారంభించింది.  ఆదివారం నాడు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకొన్న పరిణామాలు  జిల్లా రాజకీయాల్లో కీలకమైన మార్పులకు సంకేతాలుగా మారుతాయా అనే అనుమానాలు కూడ వ్యక్తమౌతున్నాయి. 

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వయాన బావ రామకోటారెడ్డి ఇంటికి వైసీపీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి  ప్రభాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలతో పాటు వైసీపీకి చెందిన కీలక నేతలు  సమావేశం కావడం  రాజకీయాల్లో చర్చకు దారితీసింది.   

ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిలు పలువురు వైసీపీ నేతలు తమ అనుచరులతో కలిసి  సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రామకోటారెడ్డి ఇంట్లోనే భోజనం చేశారు.

ఓ ఇంటి  విషయమై  కోటారెడ్డి కుటుంబానికి సోమిరెడ్డికి మధ్య మనస్పర్థలు చోటు చేసుకొన్నాయనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ మనస్పర్థల కారణంగానే రామకోటారెడ్డి వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడ సాగుతోంది. ఈ తరుణంలోనే వైసీపీ  కీలక  నేతలు రామకోటారెడ్డితో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

రూరల్ మండలం మద్దూరుపాడులో దారికి సంబంధించి ఒక ఇల్లు అడ్డుగా ఉందనే విషయమై కొద్ది రోజులు గొడవ నడిచింది.  తహాసీల్దార్ కార్యాలయం ఎదటు నిరాహార దీక్షలు  చేశారు. ఈ విషయంలో  బీద సోదరులు కూడ రామకోటారెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంగా ఆయన టీడీపీ నాయకత్వం పట్ల అసంతృప్తికి గురైనట్టుగా చెబుతున్నారు.

రామకోటారెడ్డి ఇంటికి  వైసీపీ నేతలు వెళ్లడం వెనుక  ప్రాధాన్యత నెలకొంది. రామకోటారెడ్డి ఆహ్వానిస్తే  వైసీపీ నేతలు వచ్చారా.. లేదా  వైసీపీ నేతలే  రామకోటారెడ్డి ఇంటికి వచ్చారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  వైసీపీ నేతలు రామకోటారెడ్డితో రాజకీయ పరమైన విషయాలను చర్చించారా.. లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.