న్యూఢిల్లీ: తాను తన నియోజకవర్గంలో పర్యటించకుండా తమ పార్టీకి చెందిన నేతలే అడ్డుకొంటున్నారని వైఎస్ఆర్‌సీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.హిందూ దళితులు, క్రైస్తవ దళితుల మధ్య చిచ్చు రాజేస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రధానిని కోరితే తనపై కేసులు పెట్టారన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ బాబాయ్, తమ జిల్లా మంత్రి రంగనాథరాజు కలిసి తనపై కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.ఈ కుట్రలో తాడేపల్లి పెద్దలు కూడ ఉన్నారన్నారనే అనుమానం కలుగుతోందన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టినవారిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన వివరించారు.

తప్పుడు కేసులు పెట్టినవారిపై ప్రివిలేజ్ నోటీసులు పంపుతామన్నారు. ఒక కులానికి అనుకూలంగా మాట్లాడిన ఏయూ వీసీని ఆ పదవి నుండి తొలగించాలని ఆయన గవర్నర్ ను కోరారు.ఎంపీగా తన హక్కులను కాలరాయడానికి టీటీడీ ఛైర్మెన్ ఎవరని ఆయన అడిగారు. రాష్ట్రంలో సాగుతున్న కుట్రలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు.

కొంతకాలంగా ఆయన పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.