Asianet News TeluguAsianet News Telugu

హామీలు నెరవేర్చండి.. ఉద్యోగ భర్తీపై రఘురామ గురి, జగన్‌కు వరుసగా నాలుగో లేఖ

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సమరం కొనసాగించే ఉద్దేశంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఆయన జగన్ కు లేఖలు సంధిస్తూ వస్తున్నారు. 

ysrcp mp raghu ramakrishna raju another letter to ap cm ys jagan for employment notification ksp
Author
Amaravathi, First Published Jun 13, 2021, 4:44 PM IST

వైసీపి తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సమరం కొనసాగించే ఉద్దేశంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటూ ఆయన జగన్ కు లేఖలు సంధిస్తూ వస్తున్నారు. శుక్రవారం ఆయన వృద్ధాప్య పింఛన్లపై జగన్ కు లేఖ రాశారు. శనివారంనాడు పెళ్లి కానుక, షాదీ ముబారక్ పథకాలపై లేఖను సంధించారు. 

అధికారంలోకి వస్తే పెళ్లి కానుక సాయం పెంచుతామని వైసీపీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఆ సాయాన్ని లక్ష రూపాయలకు పెంచుతామని ప్రకటించిందని చెప్పారు. పెళ్లి కానుక సాయం పెంపుపై ప్రజల నుంచి ఎన్నికల్లో మద్దతు లభించిందని, అందువల్ల ఇచ్చిన హామీని ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు.  ఏపీలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఆయన జగన్ ను కోరారు. 

Also Read:వైసీపీ వెబ్‌సైట్ ఎంపీల లిస్ట్‌‌లో రఘురామ పేరు తొలగింపు.. రెబల్ నేతకు జగన్ ఝులక్

అటు కేంద్రమంత్రులు, లోక్‌సభ స్పీకర్, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలకు రఘురామ వరుసపెట్టి లేఖలు రాస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తనపై అక్రమ కేసులు పెట్టారని, సీఐడీ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ జాతీయ స్థాయిలో మద్ధతు కూడగడుతున్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాల్సిందిగా పిటిషన్ వేసినందుకే తనను టార్గెట్ చేశారంటూ ఆ లేఖల్లో పేర్కొంటున్నారు. 

ఏపీ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ ఇవాళ కూడా సీఎం జగన్‌కు రఘురామ లేఖ రాశారు. ఉద్యోగాల భ‌ర్తీ క్యాలెండ‌ర్ విడుద‌ల హామీ నెర‌వేర‌లేద‌ని.. ఏటా జ‌న‌వ‌రిలో ఉద్యోగాల భర్తీ క్యాలెండ‌ర్ ఉంటుంద‌ని ఎన్నికల మేనిఫెస్టోలో వైకాపా హామీ ఇచ్చిన‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ హామీతో ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగుల నుంచి మ‌ద్ద‌తు ల‌భించింద‌ని రఘురామ గుర్తుచేశారు. ఉగాదికి నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌న్న ఆశ‌తో నిరుద్యోగులు ఎదురు చూశార‌ని ఆయన చెప్పారు. ఏపీ ప్ర‌భుత్వం వెంట‌నే ఉద్యోగాల భ‌ర్తీకి వార్షిక క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించాల‌ని రఘురామ ఆ లేఖ‌లో కోరారు.

గ్రామ స‌చివాల‌యాల్లో 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని, ప‌శుసంవ‌ర్ధ‌క శాఖ‌లో 6,100 పోస్టులు, 18 వేల ఉపాధ్యాయ, 6 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు రిక్రూట్‌మెంట్‌కు సిద్ధంగా ఉన్నాయ‌ని వెల్లడించారు. కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌కుండా పక్కనపెట్టేశారని.. వంద‌ల సంఖ్య‌లో సెక్ర‌టేరియ‌ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని రఘురామ స్పష్టం చేశారు. మూడు వేల పోస్టుల కోసం 2018-19లో ఏపీపీఎస్సీ నోటిఫికేష‌న్ ఇచ్చింద‌ని.. కోర్టులో కేసుల కార‌ణంగా అంతంత మాత్ర‌మే భ‌ర్తీ అయ్యాయ‌ని చెప్పారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా మెగా డీఎస్సీ తీసుకొస్తామ‌ని సీఎం జగన్‌ ప్ర‌క‌టించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ప్ర‌తి కుటుంబానికి ప్ర‌భుత్వ ఉద్యోగం హామీని ఇప్ప‌టికీ నెరవేర్చ‌లేద‌ని రఘురామ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios