Asianet News TeluguAsianet News Telugu

సినీ పరిశ్రమను ఉప్పుతో పోల్చిన రఘురామ.. బెజవాడలో డ్రగ్స్ రాకెట్‌పై సంచలన వ్యాఖ్యలు

సినీ పరిశ్రమను మటన్, ఉప్పుతో రఘురామ పోల్చారు. ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయం కొంతే అయినా.. అది కూరలో ఉప్పులాంటిదని చెప్పుకొచ్చారు. మటన్ కిలో రూ.800 పెట్టి కొనుగోలు చేస్తామని, ఉప్పు కిలో రూ.10 అని అన్నారు. అయినా కూడా ఆ ఉప్పు లేని కూర ఎంత చప్పగా ఉంటుందో తెలిసిందేనని అభివర్ణించారు

ysrcp mp raghu rama krishnam raju slams on drug issue
Author
Amaravati, First Published Sep 21, 2021, 2:51 PM IST

డ్రగ్స్ వ్యహారంలో ఏపీ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. గుజరాత్ తీరంలో రూ.9 వేల కోట్ల హెరాయిన్ దొరకడం, దానికి ఆంధ్రాతో సంబంధాలుండడంపై ఆయన ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ, రాజధానిలో గతంలోనే డ్రగ్స్ మూలాలున్నాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు. 

తాలిబన్లకు కేంద్రమైన ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆంధ్రాకు డ్రగ్స్ ఎలా వస్తున్నాయని రఘురామ ప్రశ్నించారు. ఆ సొమ్మును ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఆయన ఆరోపించారు. అయితే విజయవాడ కమిషనర్ మాత్రం ఆ సమస్యను తీసిపారేశారని, కొంచెం తీవ్రంగా దానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని రఘురామ డిమాండ్ చేశారు. డ్రగ్స్ కాకినాడ పోర్టుకు ఎందుకొచ్చాయి? విజయవాడకు ఎలా వచ్చాయి? అన్న దానిపై సీఎం జగన్ విచారణ జరిపించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు సినీ పరిశ్రమను మటన్, ఉప్పుతో రఘురామ పోల్చారు. ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయం కొంతే అయినా.. అది కూరలో ఉప్పులాంటిదని చెప్పుకొచ్చారు. మటన్ కిలో రూ.800 పెట్టి కొనుగోలు చేస్తామని, ఉప్పు కిలో రూ.10 అని అన్నారు. అయినా కూడా ఆ ఉప్పు లేని కూర ఎంత చప్పగా ఉంటుందో తెలిసిందేనని అభివర్ణించారు. సినీ పరిశ్రమ కూడా అలాంటిదేనన్నారు. ఏపీలో సినిమా ఇండస్ట్రీ టర్నోవర్ రూ.1,200 కోట్లకు మించి లేదని, తాను సినీ పెద్దలతో మాట్లాడి ఈ విషయాన్ని చెబుతున్నానని రఘురామ తెలిపారు. టికెట్ పై సగటున 14 శాతం జీఎస్టీ వేసినా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కేవలం రూ.100 కోట్లేనన్నారు.

సినీ వినోదం ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొంటూ ప్రకటనలు చేయడం మానుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పొద్దంతా పనిచేసి వచ్చి ఓ సామాన్యుడు తాగే లిక్కర్‌ను రూ.50 నుంచి రూ.250కి పెంచినప్పుడు ఆ విషయం గుర్తురాలేదా? అని రఘురామ ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ రేట్లు రూ.25 నుంచి రూ.30 ఉన్న థియేటర్లు మనుగడ సాగించాలంటే ధరలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios