కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. ఇది ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా అని ఆయన ప్రశ్నించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాని వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. ఏపీలో ముందస్తుకు అవకాశాలు ఎక్కువగా వున్నాయన్న రఘురామ.. పవన్‌ను దుర్భాషలాడటం మంచిదికాదన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని రఘురామ పేర్కొన్నారు.

తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఇల్లు కట్టుకునేందుకు చంద్రబాబుకు అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా అని ఆయన ప్రశ్నించారు. జగనన్నకు చెబుదాం అనే స్కీమ్ ఫెయిల్ అయ్యిందని.. అందువల్ల ఇప్పుడు జగనన్న సురక్ష అనే కొత్త టైటిల్‌ని వదిలారని, అసలు ఈ పథకం ఏంటని రఘురామ కృష్ణంరాజు నిలదీశారు. 

ALso Read: మీసం మేలేయడం చేతకాదు, చేతల్లో చూపిస్తా: పేర్నినానికి పవన్ కౌంటర్

అంతకుముందు పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ ఒక్క చెప్పు చూపిస్తే తాను రెండు చెప్పులు చూపిస్తానని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను నారాహి యాత్రగా ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్నారు. రోజుకో డైలాగ్ చెప్పి దాన్ని వ్యూహామంటారని పవన్ తీరుపై పేర్ని నాని మండిపడ్డారు. వ్యూహాల్ని నమ్ముకుంటే అసెంబ్లీకి వెళ్లలేడని... ప్రజలను నమ్ముకుంటేనే అసెంబ్లీలో అడుగుపెడతారని పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని హితవు పలికారు. 

జనసేనను నడిపిస్తుంది చంద్రబాబు అనే విషయాన్ని చిన్నపిల్లాడు కూడ చెబుతాడన్నారు. టీడీపీ కోసం కొత్త డ్రామాలకు పవన్ కళ్యాణ్ తెరతీశాడని ఆయన విమర్శించారు. బుస మాటలు , సొల్లు మాటలు తాను కూడా చెబుతానన్నారు. ఈ రకమైన మాటలు చెప్పడం నీకే వస్తుందా అని పేర్నినాని సెటైర్లు వేశారు. ఏపీలో జగన్ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు తీశారని ఆయన గుర్తు చేశారు.

ALso Read: మక్కెలిరగదీస్తాం: పవన్ కళ్యాణ్ కు రెండు చెప్పులు చూపిన పేర్నినాని

పవన్ ఎన్ని సినిమాలు తీస్తే తాము ఎన్ని ఆపామని ఆయన ప్రశ్నించారు. సినిమాలు బాగా తీయకపోతే ఎందుకు ఆడుతాయని నాని సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వ హయంలో సినిమా టిక్కెట్లపై పన్నులు వేయలేదా అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు చే అంటే చంద్రబాబు గుర్తు వస్తారన్నారు. సీఎం పదవి ఏమైనా దానమా , ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి అని పేర్ని నాని ప్రశ్నించారు.