ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై సమరం చేస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ఏపీ శాసనమండలి రద్దుపై పావులు కదుపుతున్నారు. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై సమరం చేస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ఏపీ శాసనమండలి రద్దుపై పావులు కదుపుతున్నారు. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ మండలి రద్దుకు సహకరించాలని, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నెరవేర్చాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు మంగళవారం కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు.

రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషికి ఈ మేరకు లేఖలు రాశారు. మండలి రద్దు చేయాలంటూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, గతంలో కూడా ఆ తీర్మానం కాపీని కేంద్రానికి పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మండలి రద్దుకు సంబంధించి సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ నిన్న ఆయనకు రఘురామ లేఖ రాశారు.

Also Read:బలం మీదే.. ఇప్పుడు చేయండి జనం నమ్ముతారు: జగన్‌కు రఘురామ లేఖ

మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దుచేస్తే చిత్త శుద్దిని ప్రజలు నమ్ముతారని అన్నారు. మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తుందని పేర్కొన్నారు. మండలిలో మెజారిటీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో సీఎం జగన్ గౌరవం పెరుగుతుందని రఘురామ పేర్కొన్నారు. 

మండలి కొనసాగించడం వృధా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పిన మాటలను నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. క్రమశిక్షణగల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానని రఘురామ స్పష్టం చేశారు. సీఎం జగన్ విలాసాలకు రూ. 26 కోట్లు ఖర్చు చేశారని గిట్టనివారు చెబుతున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.