Asianet News TeluguAsianet News Telugu

బలం మీదే.. ఇప్పుడు చేయండి జనం నమ్ముతారు: జగన్‌కు రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. నవ హామీలు - వైఫల్యాలు పేరుతో ఆయన ఇప్పటి వరకు తొమ్మిది లేఖలు రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరో 9 లేఖలు రాస్తానని ఆయన చెప్పారు. తాజాగా సోమవారం ఆయన మరో లేఖను రాశారు.

ysrcp mp raghu ramakrishna raju letter to ap cm ys jagan ksp
Author
Amaravathi, First Published Jun 21, 2021, 1:42 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమరాజు లేఖల పరంపర కొనసాగుతోంది. నవ హామీలు - వైఫల్యాలు పేరుతో ఆయన ఇప్పటి వరకు తొమ్మిది లేఖలు రాశారు. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో మరో 9 లేఖలు రాస్తానని ఆయన చెప్పారు. తాజాగా సోమవారం ఆయన మరో లేఖను రాశారు.

శాసనమండలిని రద్దు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. మెజారిటీ ఉన్నప్పుడు మండలిని రద్దుచేస్తే చిత్త శుద్దిని ప్రజలు నమ్ముతారని అన్నారు. మెజారిటీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తుందని పేర్కొన్నారు. మండలిలో మెజారిటీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో సీఎం జగన్ గౌరవం పెరుగుతుందని రఘురామ పేర్కొన్నారు. 

మండలి కొనసాగించడం వృధా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పిన మాటలను నమ్మాలంటే తక్షణమే శాసనమండలిని రద్దు చేయాలని రఘురామ డిమాండ్ చేశారు. క్రమశిక్షణగల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానని రఘురామ స్పష్టం చేశారు. సీఎం జగన్ విలాసాలకు రూ. 26 కోట్లు ఖర్చు చేశారని గిట్టనివారు చెబుతున్నారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Also Read:అమరావతిపై జగన్ కు రఘురామ కృష్ణంరాజు లేఖ: మూడు రాజధానులపై విస్మయం

కాగా, నిన్న జగన్‌కు రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రస్తుత సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. పాదయాత్రలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ జగన్ ఆ హామీ ఇచ్చారని రఘురామ కృష్ణం రాజు గుర్తు చేశారు. కనీసం 30 వేల ఎకరాల్లో రాజధాని ఉండాలని జగన్ సూచించారని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయాన్ని మార్చుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును దుర్వియోగం చేయవద్దని ఆయన జగన్ కు సలహా ఇచ్చారు. మూడు రాజధానులపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి భవిష్యత్తు లేకుండా చేశారని ఆయన విమర్శించారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు ఒకదానినొకటి అనుసంధానించి ఉంటాయని, ఈ మూడు వ్యవస్థలు ఒకే చోట ఉంటే ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన అన్నారు ప్రపంచ స్థాయి హరిత నగరంగా తీర్చిదిద్దాలని కోరుతూ రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు 550 రోజులుగా ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios