అమరావతి: కరోనా మహమ్మారి సెగ మరో వైసిపి ఎంపీకి తాకింది. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఎంపీ పీఏ, కారు డ్రైవర్ తో పాటు అతని ముఖ్య అనుచరులు ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ  అయ్యింది. దీంతో జాగ్రత్తపడ్డ ఎంపీ సురేష్ హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.   

ఏపీలో ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు కరోనా బారినపడ్డారు. ఎంపీ విజయసాయి రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కరోనా బారినపడ్డారు. కరోనా నుండి రోశయ్య కోలుకొన్నారు. శివకుమార్ క్వారంటైన్ కే పరిమితమయ్యారు. 

read more తన కారణంగా కూతురికి కరోనా వచ్చిందనే బాధతో..

ఇదిలావుంటే కరోనా వైరస్ తో రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అట్టుడుకుతోంది. తాజాగా గత 24 గంటల్లో కూడా ఈ జిల్లాలో వేయికి పైగా కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 1324 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ కోవిడ్-19 తాజాగా జడలు విరబోసుకుంది. గత 24 గంటల్లో కొత్తగా ఈ జిల్లాలో 1012 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 88 వేలు దాటింది. మొత్తం ఇప్పటి వరకు 88671 కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 723, చిత్తూరు జిల్లాలో 300, గుంటూరు జిల్లాలో 656, కడప జిల్లాలో 294 కేసులు నమోదయ్యాయి.

కృష్ణా జిల్లాలో 407, కర్నూలు జిల్లాలో 742, నెల్లూరు జిల్లాలో 299, ప్రకాశం జిల్లాలో 248, శ్రకాకుళం జిల్లాలో 349, విశాఖపట్నం జిల్లాలో 936, విజయనగరం జిల్లాలో 523 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో 12391 కేసులతో తూర్పు గోదావరి జిల్లా అగ్రస్థానానికి ఎగబాకింది.

మరణాల సంఖ్యలో కూడా తూర్పు గోదారి జిల్లా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 113 మంది మరణించారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 156 మంది మరణించారు. కృష్ణా జిల్లా 139 మరణాలతో రెండో స్థానంలో ఉంది.

 తాజాగా గత 24 గంటల్లో ఏపీలో కరోనా వైరస్ బారిన పడి 52 మంది మరణించారు. గుంటూరు జిల్లాలో 9  మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనిమిది మరణించారు. తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఆరుగురు చొప్పున మృత్యువాత పడ్డారు. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, విజయనగరం జిల్లాలో నలుగురు మరణించారు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురేసి చనిపోయారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు దీంతో ఏపీలో ఇప్పటి వరకు మొత్తం మరణాల సంఖ్య 985కు చేరుకుంది.