తన కారణంగా తన కూతురికి కరోనా సోకిందని ఓ తండ్రి తట్టుకోలేకపోయాడు. కడుపుతో ఉన్న తన కూతురికి తన కారణంగానే కరోనా సోకిందని తెలిసి ఆవేదన చెందాడు.  ఈ క్రమంలో తట్టుకోలేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరం మోరంపూడి చైతన్య నగర్ కు చెందిన 57 ఏళ్ల ఓ జట్టు కూలీ రంభ ఊర్వసి సెంటర్ ఉల్లిపాయల మార్కెట్ లో పనిచేస్తున్నాడు. చాలా కాలం కిందట శ్రీకాకుళం జిల్లా నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఆయన ఇక్కడ స్థిరపడి ఇల్లు కట్టుకుని పిల్లల్ని చదివించుకుని ఒక స్థాయికి తీసుకు వచ్చాడు. అయినా జట్టు పని మానకుండా వెళ్లి వస్తున్నాడు.

 అతడికి భార్య, కొడుకు,కూతురు ఉన్నారు. కుమార్తె అంటే అతడికి చాలా ఇష్టం. ఆమె రెండు నెలల గర్భిణీ. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో మనస్తాపంతో ఉన్నాడు. అతడికీ కరోనా లక్షణాలు ఉండటంతో మరింత కుంగిన ఆతడు.. తన వల్లె కుమార్తెకూ కరోనా వచ్చిందని ఆవేదన చెందాడు. గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రైలు పెట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఆధార్ కార్డు ఆధారంగా అతడిని గుర్తించారు. మృతదేహానికి శనివారం కరోనా పరీక్ష చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.