Asianet News TeluguAsianet News Telugu

మాగుంట వ్యాఖ్య: ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి "సౌత్" ట్విస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. అమిత్ అరోరా ఎవరో తనకు తెలియదని అన్నారు.

ysrcp mp magunta srinivasulu reddy says He do not know Amit arora
Author
First Published Dec 1, 2022, 10:37 AM IST

అమరావతి: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. వ్యాపారవేత్త అమిత్ అరోరా అరెస్టు రిమాండ్ రిపోర్టులో ఆయన పేరును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. వారే ఆరోపణలు చేస్తున్నారు, వారే రాసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇది దక్షిణ భారతదేశం వ్యాపారులపై ఉత్తర భారతదేశం వ్యాపారులు చేసే కుట్ర అని అన్నారు. గతంలో నిర్వహించిన మీడియా సమావేశంలోనే తాను అన్ని వివరాలు వెల్లడించానని  చెప్పారు. 

అమిత్ అరోరా ఎవరో తనకు తెలియదని అన్నారు. తాను ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడలేదని తెలిపారు. తమ కుటుంబం 70 ఏళ్లుగా వ్యాపారం చేస్తోందని అయన గుర్తు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర గానీ తన కుమారుడి పాత్రగానీ లేదని ఆయన స్పష్టం చేశారు. వంద కోట్ల రూపాయలైతే వారినే తీసుకోమనండి అని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తాను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరంగా మాట్లాడుతానని ఆయన చెప్పారు.

ఇక, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి నిందితుల్లో ఒకరైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత‌, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో సహా పలువురి పేర్లను ప్రస్తావించిన సంగతి  తెలిసిందే. డిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు బుధవారం ఉదయం అమిత్ అరోరాను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. రిమాండ్ రిపోర్టులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ పేర్లు కూడా ఉన్నాయి.

కేసును దర్యాప్తు కోసం ఏజెన్సీకి అప్పగించిన తర్వాత కవిత తన మొబైల్ ఫోన్ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ)ని ఆరుసార్లు మార్చుకున్నారని ఈడీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా, ఐఎంఈఐ ఆధారంగా డేటాను విశ్లేషించినట్టుగా తెలిపింది. దర్యాప్తుకు ఆటంకం కలిగించడానికి డిజిటల్ సాక్ష్యం నాశనం చేయబడిందని కనుగొంది.

‘‘శరత్ చంద్రారెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అమిత్ అరోరా నియంత్రణలో ఉన్న సౌత్ గ్రూప్ అనే కంపెనీ నుంచి ఆప్ నాయకుల తరపున విజయ్ నాయర్ రూ. 100 కోట్ల ముడుపులు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని అమిత్ అరోరా వెల్లడించారు. దర్యాప్తును అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేశారు. కేసును ఏజెన్సీకి అప్పగించిన తర్వాత 36 మంది అనుమానితులు/నిందితులు తమ 176 సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేశారు. 170 సెల్‌ఫోన్‌లలో 17 సెల్‌ఫోన్‌ల నుంచి డేటాను తిరిగి పొందగలిగాం. అన్ని ఫోన్లు దొరికి ఉంటే ఈ కేసులో చేతులు మారిని మరిన్ని ముడుపులు వెలుగులోకి వచ్చేవి. ఇతర ముఖ్యమైన వ్యక్తుల ప్రమేయం మరింత స్పష్టంగా బయటపడి ఉండేది’’ అని ఈడీ పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios