ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనా చౌదరిపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి. సుజనాచౌదరి ఒక డుప్లికేట్‌ లీడర్‌ అంటూ మండిపడ్డారు. సీఎం జగన్ పై సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.  

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిస్తే వారిద్దరి మధ్య  జరిగిన చర్చను బయటకు చెప్పడానికి నీవెవరంటూ మండిపడ్డారు. గోడదూకిన నీలాంటి వారికి చెప్పే అర్హత లేదని విమర్శించారు. అమిత్ షాతో జగన్ భేటీకి సంబంధించి అధికారికంగా వెల్లడించే హక్కు కేంద్ర ప్రభుత్వానికే ఉంటుదన్న విషయం ఎలా మరిచిపోయావంటూ ప్రశ్నించారు. 

సుజనాచౌదరిపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే సుజనాచౌదరిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు ఎంపీ బాలశౌరి.
 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందవిన ఎంపీలంతా కలిసి త్వరలోనే ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు బాలశౌరి స్పష్టం చేశారు. చంద్రబాబు అజెండా మోయడానికే సుజనాచౌదరి బీజేపీలో చేరారని ఆరోపించారు.  

సుజనా చౌదరికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా ? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా అంటూ నిలదీశారు. ప్రధాని మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ఒకప్పుడు ధర్మదీక్ష పోరాట దీక్షలు చేసింది సుజనాచౌదరి కాదా అని నిలదీశారు. 

అలాంటిది ఇప్పుడు అదే పార్టీలో చేరి ఢిల్లీలో కూర్చొని చంద్రబాబు ఏజెంట్‌లా వ్యవహరిస్తూ విషపు కూతలు కూస్తున్నారంటూ మండిపడ్డారు. సుజనాచౌదరి ఒక డుప్లికేట్‌ లీడర్‌ అని, ఆయన మాటలకు ఎక్కడా విలువ లేదని చెప్పుకొచ్చారు. 

బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా చౌదరీ లాంటి వాళ్లకు చట్ట సభల్లో అడుగుపెట్టే అర్హత లేదన్నారు. సుజనాచౌదరి ఒక నకిలీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులను మోసం చేసిన వారు చట్టసభలలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాడ్ చేశారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రైవేట్ బిల్లు పెడతామని బాలశౌరి హెచ్చరించారు.