అమరావతి: పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతామని వైసీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు. 

ఈ నేపథ్యంలో విజయవాడలో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. తాము ఎందుకు శాసన సభకు హాజరుకావడం లేదో తెలియజేస్తూ నాలుగు పేజీల లేఖ రాశారు.  

 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని అది రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందర్నీ తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మీరు నడుపుతోన్న సభను శాసన సభ అంటారా అని లేఖలో ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా చేసిన దుర్మార్గాలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యేలు లేఖలో డిమాండ్ చేశారు.