అమరావతి: ఏపీ సీఎం వైయస్ జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు. 

ముఖ్యమంత్రి వైయస్ జగన్ కుటుంబంపై చాలా దారుణంగా తప్పుడు పోస్టులు పెడుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీపైనే తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 

ఇటీవలే గుంటూరు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు వైసీపీ సోషల్ మీడియాపై తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వైసీపీ సోషల్ పై దుష్ప్రచారం చేశారని దానిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. 

వైసీపీ సోషల్ మీడియాపై చేసిన ప్రచారంపై చర్చకు సిద్ధమంటే తామే చంద్రబాబు ఎక్కడకు పిలిచినా వస్తామన్నారు. చంద్రబాబు నాయుడు రావొద్దని తామే వెళ్తామని చెప్పుకొచ్చారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టే ఆయన దగ్గరకే వెళ్తామని చెప్పుకొచ్చారు. 

చంద్రబాబు నాయుడు అంటే తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు ఎమ్మెల్యే జోగి రమేష్. ఇటీవలే లక్ష 34వేల పోస్టులకు సంబంధించి సీఎం జగన్ ప్రకటన ఇస్తే దానిపై కూడా రాద్ధాంతం చేస్తారా అంటూ మండిపడ్డారు. 

గ్రామ సచివాలయం ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అభ్యర్థులు అత్యధిక ఉద్యోగాలు సాధించారని చెప్పుకొచ్చారు. లక్ష 34వేల ఉద్యోగాలలో 70వేల ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన అభ్యర్థులే ఉద్యోగాలు సాధించారని చెప్పుకొచ్చారు. 

గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఉద్యోగాలు సాధించామని దళిత, బీసీ, మైనారిటీ యువత సంతోషంగా ఉండటంతో వారి సంతోషాన్ని పట్టలేక చంద్రబాబు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

తమ సామాజిక వర్గాల వారు అత్యధికంగా ఉద్యోగాలు సాధించారన్న అక్కసుతో గ్రామ సచివాలయ ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. పేపర్ లీకైందంటూ దుష్ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. 

చంద్రబాబు తోకపత్రిక రాసిన ఒక వార్తను ఆధారంగా చేసుకుని గ్రామ సచివాలయం ఉద్యోగాలపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఒక గాలివార్తను తీసుకుని 14ఏళ్ల ఇండస్ట్రీ అంటూ చెప్పుకునే నువ్వు వాటిని ఆధారంగా చూపించమని అడిగితే తోకముడుచుకుని పారిపోతావా అంటూ మండిపడ్డారు. 

దళితులు ఉద్యోగాలు సాధిస్తే ఓర్వలేక కడుపు మంటతో గ్రామ సచివాలయం ఉద్యోగాలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తిట్టిపోశారు. 14ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏనాడైనా లక్ష ఉద్యోగాలు ఇప్పించారా అంటూ మండిపడ్డారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజల విద్యార్థులకు ఉద్యోగాలు వస్తే నీకెందుకు కడుపు మంట అని నిలదీశారు. తమ సామాజిక వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టబద్ధత చేసిన సీఎం జగన్ తమకు చుట్టమన్నారు. 

జగన్ పై తెలుగుదేశం పార్టీ తప్పుడు పోస్టులు పెట్టడం మానుకోకపోతే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఎమ్మెల్యేలు జోగి రమేష్, ఉండవల్లి శ్రీదేవి, సుధాకర్ బాబులు.