అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిన ఫిరాయింపుల అంశం ఇంకా కుదిపేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్నా ఆ ఫిరాయింపుల అంశం మాత్రం వెంటాడుతూనే ఉంది. 

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తమను కోట్లాది రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసేందుకు ప్రలోభాలకు గురి చేశారంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్కొక్కరు బయటపెడుతున్నారు. 

ఇటీవలే ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం తనను చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు గురి చేసిన వైనాన్ని ప్రజలకు కార్యకర్తలకు వివరించారు. అయినా నైతిక విలువలకు  కట్టుబడి తాను టీడీపీలో చేరలేదంటూ చెప్పుకొచ్చారు. 

తాజాగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా తనను ప్రలోభపెట్టిన అంశాన్ని కూడా అసెంబ్లీలో బట్టబయలు చేశారు. గతంలో తాను తిరుపతి ఎంపీగా పనిచేస్తున్న తరుణంలో తనను టీడీపీలో చేరాలంటూ ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపించారు. 

నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత మాజీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్, నలుగురు మంత్రులు, కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు తనను కలిసి టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. 

టీడీపీలో చేరితే రూ.50కోట్లు ఇస్తామని మరో రూ.50 కోట్లు నిధులు ఇస్తామని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునని అంటూ బేరాలు ఆడారని గుర్తు చేశారు. వారంతా కలిసి తనను ప్రలోభ పెట్టాలని చాలా ప్రయత్నం చేశారని వారి ఆఫర్ ను తిరస్కరించానని చెప్పుకొచ్చారు. 

నీ తల్లి నీకు ఎంత ముఖ్యమో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన తల్లి అని కన్నతల్లికి ద్రోహం చేయలేనని తెగేసి చెప్పడంతో వారు వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. అలాంటి నాయకులు ప్రజా స్వామ్యంలో ఉండటం దురదృష్టకరమన్నారు.  

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచి తెలుగుదేశంలో చేరిన 23 మంది ఎమ్మెల్యేలను ఎలా ప్రలోభ పెట్టి పార్టీ మారేలా చేశారో అప్పుడు తనకు తెలిసిందన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీని గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని చెప్పుకొచ్చారు. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంఖ్యే చివరకు తెలుగుదేశం పార్టీకి మిగిలిందని ఎద్దేవా చేశారు. తాను నోరు తెరిచి మాట్లాడితే టీడీపీ నేతలు అవమానంతో చస్తారంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలను గెలిపించుకునేందుకు వైయస్ జగన్, ఆయన తల్లి వైయస్ విజయమ్మ, చెల్లి వైయస్ షర్మిలలు ఎంతో కష్టపడ్డారని వారి కష్టాన్నిఅమ్మేసుకున్నారంటూ ఎమ్మెల్యే వీ వరప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అధికారం కోల్పోయినా ఒక్కోక్కరు టీడీపీ ప్రలోభాలను బయటపెట్టుతుండటంతో చంద్రబాబుకు మింగుడుపడటం లేదు. వైసీపీ ఎమ్మెల్యేల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తలపట్టుకుంటున్న పరిస్థితి ఏపీ అసెంబ్లీలో నెలకొంది.