గుంటూరు: జాతిపిత గాంధీజీ లా జగన్ కూడా తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు దగ్గరుండి చూసారని... అందువల్లే అధికారంలోకి వచ్చిన వెంటనే ''నేను వున్నాను-నేను విన్నాను'' అంటూ ప్రజల కష్టాలు తీరుస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొనియాడారు. బాపూజీ కలలు కన్న స్వరాజ్యం సీఎం జగన్ ద్వారా సాధ్యమని...నేటి తరం బాపూజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు శ్రీదేవి. 

గుంటూరు జిల్లా పెదపరిమి గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ... సచివాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్థానికులైన ఎమ్మెల్యే శంకర్రావు సచివాలయం నిర్మాణానికి తోడ్పడినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

''సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక నవ శఖానికి నాంది పలికారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారు. కేవలం ఒక్క సంవత్సరంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఆల్ టైం రికార్డ్ సాధించారు'' అని అన్నారు. 

''దశల వారిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు సీఎం. గత టీడీపీ హయాంలో మందు టెండర్లు పొందిన వారు కోటీశ్వర్లు అయ్యారు కానీ మందు తాగిన వారు రోగాల బారిన పడ్డారు. కానీ వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం ధరలు పెంచిందని...దీంతో మద్యం వినియోగం చాలా తగ్గింది'' అని తెలిపారు. 

read more  సిద్దా రాఘవులు మాదిరే గొట్టిపాటి రవిని కూడా..: చినరాజప్ప

''గతంలో పెన్షన్, రైస్ కార్డులు పొందాలంటే ,అధికారుల చుట్టూ చెప్పులు అరిగెలా తిరిగేవారు. కానీ ఇప్పుడు నవగ్రహాలు చుట్టూ తిరిగినట్లు వాలంటీర్ల చుట్టూ ప్రతిఒక్కరూ తిరుగుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ వల్ల పాలన చాలా సులభతరం అయ్యింది'' అని అన్నారు. 

''పెదపరిమి కరోనా ఫ్రీ గ్రామంగా ఉండటం సంతోషం గా ఉంది. కరోనా వల్ల ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నా ఏపీ మాత్రం కదలకుండా ఉంది ఇందుకు కారణం సీఎం జగన్. గ్రామా సచివాలయాల ద్వారా కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ ముందంజలో ఉన్నది. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా జగన్ పరిపాలన ఉంది'' అని పేర్కొన్నారు. 

''ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్థాలు తినడం మానుకోండి. తాజా కూరలు,తాజా మాంసం ,వేడి ద్రవ పదార్థాలు తీసుకుని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి'' అని ఎమ్మెల్యే శ్రీదేవి ప్రజలకు సూచించారు.