అమరావతి: గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆరా తీశారు. ఈనెల 2న వినాయకచవితి సందర్భంగా అనంతవరంలోని వినాయకుడి విగ్రహం వద్ద శ్రీదేవిని కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు కులం పేరుతో దూషించినట్లు ఆమె ఆరోపించారు. 

ఈ ఘటనపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఎమ్మెల్యే శ్రీదేవి. హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితతో కలిసి తనకు జరిగిన అవమానంపై జగన్ కు తెలియజేశారు. తన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలు చేస్తున్నారంటూ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా అధైర్యపడొద్దని ధైర్యంగా ఉండాలంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు. తాను అండగా ఉంటానని వాస్తవ ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 

దళిత మహిళా ఎమ్మెల్యే అయిన శ్రీదేవిని అవమాన పరచిన వారిని ఎవరినీ వదలొద్దని హోంమంత్రి సుచరిత, సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ సీఎం జగన్ ను కోరారు. టీడీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తుంటే వర్ల రామయ్యలాంటి నేతలు వారిని ప్రోత్సహించడం సిగ్గు చేటని విమర్శించారు. 

రాజధాని ప్రాంతంలో వినాయకుడిని దర్శించుకునేందుకు వెళ్లిన శ్రీదేవిని కులం పేరుతో దూషించడాన్ని వారు తప్పుబట్టారు. వైసీపీ గ్రామ అధ్యక్షుడు పోలు రమేశ్‌ ఆహ్వానం మేరకు వినాయకుడి విగ్రహం వద్దకు కుటుంబంతో కలిసి వెళ్లి ఎమ్మెల్యే పూజలు చేస్తున్నారని తెలిపారు. 

ఆ సమయంలో టీడీపీ నేత కొమ్మినేని శివయ్యతోపాటు మరికొందరు పెద్దగా అరుస్తూ దళిత మహిళ పూజ చేస్తే వినాయకుడు మైల పడతాడని, పూజ చేయొద్దని ఆమె వైపు దూసుకెళ్లారని అంతేకాకుండా ఆమెను తీవ్ర పదజాలంతో కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవికి ధైర్యంగా ఉండాలని జగన్ సూచించారు.  

ఈ ఘటనపై మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం తూళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.