తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు.చంద్రబాబు నాయుడు ఏనాడూ ప్రజా సంక్షేమానికి సంబంంధించిన కార్యక్రమాలు ప్రారంభించలేదని విరుచుకుపడ్డారు. 

రాజశేఖర్‌ రెడ్డి కొడుకు ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కొడుకు లోకేష్‌ కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి అని విమర్శించారు. లోకేష్ ను కూడా గెలిపించుకోలేకపోయిన చంద్రబాబు జగన్ ను విమర్శించే అర్హత లేదన్నారు.  

లోకేష్ లాంటి కొడుకు పుట్టినందుకు చం‍ద్రబాబు మథనపడుతున్నారంటూ ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చర్రితలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమాన్ని ఏడాది ముందుగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించబోతున్నారని చెప్పుకొచ్చారు. 

రుణాలు అన్ని మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ హామీని తుంగలోకి తొక్కారని విమర్శించారు. జగన్‌ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల దెబ్బలకు చంద్రబాబు మైండ్‌ బ్లాంక్‌ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని తిట్టిపోశారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క ప్రజాదరణ కార్యక్రమం అయినా ప్రవేశ పెట్టారా అని నిలదీశారు. 

చంద్రబాబు విద్యను అమ్ముకునే వాడిని విద్యాశాఖ మంత్రిగా చేస్తే సీఎం జగన్‌ విద్యకు పెద్ద పీట వేస్తున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మటాష్‌ అవుతుందని విమర్శించారు. 

ఏనాడైతో మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయాడో ఆనాటి నుంచే టీడీపీ కనుమరుగవడం ప్రారంభించిందన్నారు. రివర్స్ టెండరింగ్ పై చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో మిగిలిన వేలాది కోట్ల రూపాయలు చంద్రబాబుకు కనబడటం లేదా అని నిలదీశారు.  

అవినీతిరహిత పాలనే లక్ష్యంగా సీఎం జగన్‌ ముందుకు వెళ్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన పాపాలను కడుక్కొడానికి పవిత్ర గంగా నదిలో స్నానం చేయాలని ఆయన సూచించారు. కాకపోతే చంద్రబాబు గంగానదిలో దిగితే అది కూడా కలుషితమవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు సుధాకర్‌ బాబు.

సీఎం జగన్ పాలనపై బుద్ధిలేని బుద్ధా వెంకన్నకూడా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. దుర్గ గుడిలో కొబ్బరి చిప్పల దొంగ బుద్ధా వెంకన్న అంటూ విమర్శించారు. రాయడం, చదవడం రాని వెంకన్న కూడా ట్విటర్‌లో పోస్ట్‌లు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బుద్ధా వెంకన్నకు ట్విటర్‌లో పోస్ట్‌ చేయడం, కామెంట్‌ చేయడం వచ్చా అంటూ నిలదీశారు సుధాకర్ బాబు.