అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్య నారాయణ రెడ్డి . జగన్‌ను జనంలో చెడుగా చిత్రీకరించేందుకే అధికారులు ఇలా చేస్తున్నారా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వున్న మాట వాస్తవమేనని మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం సద్దుమణగకముందే మరో వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు అధికారుల కారణంగా తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే... తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్య నారాయణ రెడ్డి బుధవారం పౌర సరఫరాల శాఖ కమీషనర్‌తో కలిసి తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో అధికారులపై సూర్యనారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారుల తప్పుడు నిర్ణయాల కారణంగానే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. ఏసీ గదుల్లో కూర్చొని ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని సూర్యనారాయణ రెడ్డి నిలదీశారు.
అలాగే ధాన్యం కొనుగోళ్ల పనులను వాలంటీర్లకు అప్పగించడంపైనా ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. మీరంతా కలిసి ముఖ్యమంత్రికి కూడా తప్పుడు సలహాలు ఇస్తున్నారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. జగన్‌ను జనంలో చెడుగా చిత్రీకరించేందుకే అధికారులు ఇలా చేస్తున్నారా అంటూ సూర్యనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకటి రెండు రోజుల్లో రైతుల ధాన్యం కొనుగోళ్ల సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు.
ALso REad:వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వుంది : మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు
ఇకపోతే.. నిన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ సంస్కరణలు చేసే వారికే వ్యతిరేకత ఎక్కువ అన్నారు సంస్కరణలకు ముందే ఫలితాలు రావని, అందుకే ప్రజల ఆమోదం రాదని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై వ్యతిరేకత వుందని... కారణం సంస్కరణలు అర్ధం చేసుకోలేకపోవడమేనని ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్కరణలు చేయనివారిని నిందించాల్సింది పోయి.. సంస్కరణలు చేసేవారిపై విమర్శలు చేస్తున్నారనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి అన్ని విధాలుగా అర్హత వుంది విశాఖకేనని.. ఈ నగరమే మెయిన్ రాజధానిగా వుంటుందని ధర్మాన స్పష్టం చేశారు. అయితే ప్రజలకు మేలు జరిగేందుకు ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా... జగన్ సంస్కరణల బాట పట్టారని ధర్మాన ప్రసాదరావు ప్రశంసించారు.
