నగరి: ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకు కరోనా మహమ్మారి అత్యంత వేగంగా విజృంబిస్తోంది. ఒక్కో రోజు పదివేలకు పైగా కేసులు బయటపడుతూ భయాందోళను గురిచేస్తుంటే అధికార యంత్రాంగం, ప్రభుత్వం మాత్రం నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. నివారణ చర్యలు అటుంచి స్వయంగా అధికార పార్టీ నాయకులే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

గతంలో కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ ను అత్యంత కఠినంగా అమలుచేసిన రోజుల్లోనూ వైసిపి ఎమ్మెల్యేలు నిబంధనలను అతికక్రమించి ఇష్టారీతిన వ్యవహరించారని ఆరోపణలున్నారు. ఈ విషయంలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా విమర్శలపాలయ్యారు. అయితే తాజాగా మరోసారి కరోనా నిబంధనలను పాటించకుండా రోజా ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.   

read more   ఏపీలో కరోనా ఉధృతి: వరుసగా 10వ రోజు 10 వేలు దాటిన కేసులు
 
నగరి ఎమ్మెల్యే రోజా నిబంధనలు పాటించకుండా మండల వ్యవసాయ సహకార సంఘాల సమావేశంలో పాల్గొన్నారు. మండల రైతు అడ్వైజరీ కమిటీ సభ్యులు, రైతు భరోసా కేంద్రాల కమిటీ మెంబర్లతో శనివారం ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఈ కార్యాక్రమంలో భారీగా ప్రజలు హాజరయ్యారని... కరోనా నిబంధనలేవీ పాటించకుండానే ఈ కార్యక్రమం జరిగిందని ప్రతిపక్ష టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రస్తుతం నగరి నియోజకర్గంలోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు జరగడంవల్ల ప్రజలు ఒకేచోట గుమిగూడి వేగంగా వ్యాప్తిచెందే అవకాశాలున్నాయని అంటున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఎమ్మెల్యే రోజా కరోనా వ్యాప్తిచెందేలా వ్యవహరించడం దారుణమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.