సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ చూసుకుని ఫించన్లు, పసుపు-కుంకుమల పేరుతో చంద్రబాబు చెక్కులు ఇస్తున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె తన సొంత అక్కాచెల్లెళ్లనే మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు.

సీఎం మాతృమూర్తి అమ్మనమ్మ తన పేరిట హైదరాబాద్‌లో ఉన్న 5 ఎకరాల భూమిని ఆడపడుచులకు దక్కకుండా చేశారని ఆమె ఆరోపించారు. ఇంట్లో వాళ్లని మోసం చేసిన వాళ్లకి బయటోళ్లని మోసం చేయడం పెద్ద విషయమేమి కాదన్నారు.

అందుకే ‘‘అమ్మకి అన్నం పెట్టలేని వ్యక్తి.. చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానంటాడని’’ వైఎస్, చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించేవారని రోజా గుర్తుచేశారు. ఫిబ్రవరిలో రూ.2500, మార్చి రూ.3,500, ఏప్రిల్ రూ.4,000 చొప్పున చెల్లించాలని చంద్రబాబు చెబుతున్నారని కానీ ఆయన ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను సాకుగా చూపించి రూ.2,500తో చేతులు దులుపుకునే ఎత్తుగడ వేస్తున్నారని రోజా ఆరోపించారు.

ఎవరైనా అప్పుడు ప్రశ్నిస్తే.. నా ఆడిబడ్డలకు డబ్బు ఇవ్వకుండా కేంద్రం కుట్రలకు పాల్పడుతుందని చెబుతారని ఆమె వ్యాఖ్యానించారు. 2014 లో రూ.14,200 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాకా సంతకం చేసి ఇంత వరకు వాటిని పట్టించుకోలేదన్నారు.

ఆ మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు పసుపు-కుంకుమ పథకంలో ఆడబిడ్డలకు రూ.10 వేలు ఇస్తున్నారని రోజా ఆరోపించారు. ఆ నాడే డ్వాక్రా రుణాలు, వడ్డీతో సహా మాఫీ చేసుంటే ఈరోజున ఆడబిడ్డలు బ్లాక్ లిస్ట్‌లోకి వెళ్లేవారు కాదన్నారు. ఈ చర్యతో ఏడుస్తున్న ఆడవాళ్లు రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారని వారి కన్నీటిని పట్టించుకునే నాధుడే లేరని చెప్పారు.

రాప్తాడులో పసుపు-కుంకుమ చెక్కులు ఇవ్వాలని వచ్చిన మంత్రి పరిటాల సునీతను మహిళలు చెప్పులు, చీపుళ్లతో స్వాగతం పలికారని రోజా చెప్పారు. పసుపు-కుంకుమ కార్యక్రమానికి వచ్చే టీడీపీ నేతలు, మంత్రుల్ని డ్వాక్రా రుణాలపై మహిళలు నిలదీయాలని ఆమె పిలుపునిచ్చారు.

చంద్రబాబు మోసాన్ని మహిళలకు వెల్లడిస్తున్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై టీడీపీ నేతలు దాడికి దిగారన్నారు. డ్వాక్రా శాఖకు మంత్రిగా, తోటి మహిళగా.. ఆడబిడ్డలను మోసం చేయడానికి సిగ్గులేదా అంటూ సునీతను ప్రశ్నించారు.

పోలీసులు లేకుండా డ్వాక్రా మహిళలకు వెళ్లే ధైర్యం పరిటాల సునీతకు లేదని ఎద్దేవా చేశారు. వనజాక్షి లాంటి నిజాయితీ గల అధికారిని టీడీపీ ఎమ్మెల్యేలు జుట్టు పట్టుకుని లాక్కెళ్లి కొట్టారని అప్పుడు చంద్రబాబు ఏం చేశారని రోజా ప్రశ్నించారు.

బెల్ట్‌షాపుల రద్దు, డ్వాక్రా రుణమాఫీ, ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు... నేడు మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారని రోజా దుయ్యబట్టారు.