చిత్తూరు: చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా మరో అవతారం ఎత్తారు. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ప్రముఖ పాత్రలకు జీవం పోసిన రోజా రాజకీయాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందిస్తున్న రోజా తాజాగా ఏపీఐఐసీ చైర్మన్ గా కూడా మరోబాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.  

అంతేకాదు మానవత్వం చాటుకోవడంలోనూ రోజాకు సాటిరారు మరెవ్వరు అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. తాజాగా మరో కీలక అవతారం ఎత్తారు రోజా. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా ఓ పాఠశాలలో హల్ చల్ చేశారు. 

విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తూ సందడి చేశారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షల్లో భాగంగా విద్యార్థులతో ఏబీసీడీలు చెప్పించారు. రోజా వైద్యపరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు తమకంటే తమకు అంటూ ఎగబడ్డారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా వైయస్ఆర్ కంటివెలుగు పథకం గొప్ప కార్యక్రమమని కొనియాడారు. పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. 

వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు మరో సంజీవని లాంటిదని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారని చెప్పుకొచ్చారు. 

వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభిస్తే....ఆయన తనయుడు సీఎం జగన్‌ రెండు అడుగులు ముందుకువేసి వైయస్ఆర్ కంటివెలుగు ను ప్రారంభించారని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరికీ కంటి సంబంధిత జబ్బులు లేకుండా చూడాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే రోజా.