గుంటూరు: వరుసగా తనకు బెదిరింపులు వస్తున్నాయని భద్రత పెంచాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ను కోరారు. మంగళవారం డీజీపీని కలిసిన ఆర్కే అనేకమంది తనను టార్గెట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందుకు తనకు గతంలోనే బెదిరింపు లేఖలు వచ్చాయని డీజీపీకి వివరించారు. 

రాజధాని భూసమీకరణ, ఓటుకు కోట్లు కేసు, సీఎం నివాసం, సదావర్తి సత్రం భూముల వ్యవహారంపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నానని అందువల్లే తనకు వరుసగా బెదిరింపులు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఏపీ సర్కార్ ఎమ్మెల్యే ఆర్కేకు వన్‌ ప్లస్‌ వన్‌ సెక్యూరిటీ ఇస్తోంది. 

గతంలో ఇసుక మాఫియా నుంచి బెదిరింపుల లేఖలు, హతమారుస్తామంటూ ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లు గుర్తు చేశారు. మావోయిస్టుల పేరిట కూడా ఇటీవల బెదిరింపుల లేఖలు వస్తున్నాయని ఈ నేపథ్యంలో తన  భద్రతను పెంచి కనీసం టూ ప్లస్‌ 2 (2+2) గన్‌మెన్‌ సెక్యూరిటీ అందజేయాలని లేఖలో కోరారు.