రాజమహేంద్రవరం: సీఎం చంద్రబాబు నాయుడు చైనా ఫోన్ లాంటి వ్యక్తి అని ఆయన బుర్రలో ఎలాంటి పీచర్స్ ఉండవని కేవలం ఇతరుల దగ్గర నుంచి కాపీ కొట్టడమే తెలుసునని ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. 

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వరం కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు రోజా వైసీపీ నేతలు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

అనంతరం జరిగిన బహిరంగ సభలో రోజా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు ఎక్కడ లేనన్ని హామీలు ఇస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అబద్దాలు చెప్తూ తాను ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందదు అంటూ భ్రమ కల్పిస్తారని ఆమాయలో పడొద్దని సూచించారు. 

చంద్రబాబు నాయుడు ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ లాంటి వారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్స్పైర్ అయిన టేబ్లెట్ వేసుకుంటే మనిషి చనిపోతాడని అలాంటి అవుట్ డేటెడ్ చంద్రబాబును గెలిపిస్తే రాష్ట్రం చచ్చిపోతుందంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబుకి కాపీ పేస్ట్ తప్ప ఇంకేమీ తెలియదన్నారు. 

ఆనాడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను కాపీకొట్టిన చంద్రబాబు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలను కాపీ కొడుతున్నారంటూ ఆరోపించారు. వృద్ధాప్య పింఛన్ రూ.2000 పెంచుతున్న చంద్రబాబు గత నాలుగున్నరేళ్లలో ఎంతమంది పింఛన్లు తొలగించారో ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. 

చంద్రబాబు వృద్ధాప్య పింఛన్ ను రూ.2000 కేవలం రెండు నెలలు మాత్రమే ఇస్తాడని అదే వైఎస్ జగన్ అయితే సంవత్సరం పాటు ఇస్తాడని చెప్పుకొచ్చారు. అవసరమైతే వృద్ధాప్య పింఛన్ రూ.3000 కూడా ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కుటుంబంలో ఎంతమందికి అర్హులు ఉంటే అంతమందికి ఇస్తారని హామీ ఇచ్చారు. 

అలాగే కుటీర పరిశ్రమల పేరుతో మహిళలను వ్యాపార వేత్తగా చేశాడా అని నిలదీశారు. తన కోడలు బ్రాహ్మణిని వ్యాపారవేత్తగా చేసి రాష్ట్ర మహిళలను గాలికొదిలేశాడని ఘాటుగా విమర్శించారు. మద్యపానం వల్ల మహిళలలు ఇబ్బందులు పడుతుంటే గుడి, బడి అనే తేడా తెలియకుండా బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చారని ధ్వజమెత్తారు. 

గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇస్తానని చెప్పి నాలుగున్నరేళ్లు కాలయాపన చేసిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ తెరపైకి తెచ్చారని రోజా విమర్శించారు. అలాగే స్మార్ట్ ఫోన్ లు ఇస్తామని చెప్పి బహిరంగ సభలకు పిలుపించుకుని ఆతర్వాత సొల్లు చెప్పి స్మార్ట్ గా పంపించేశారన్నారు. 

డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇస్తామనడం ఒక మోసం అంటూ రోజా చెప్పుకొచ్చారు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తూ గెలిస్తేనే అవి పనిచేస్తాయని చంద్రబాబు చెప్తున్నారని అది అంతా మోసపూరితమన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 

ఆరు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారిసైతం అత్యాచారానికి గురైందని రోజా ఆరోపించారు. వైసీపీ మేనిఫెస్టోను దొంగిలించిన దొంగ చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. చైనా ఫోన్ లాంటి చంద్రబాబును పక్కకు పెట్టాలని ఐ ఫోన్ లాంటి వైఎస్ జగన్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. 

మాయమాటలు చెప్పిన చంద్రబాబును సింగపూర్ వరకు తరిమితరిమి కొట్టాలని సూచించారు. తెలంగాణ ప్రజలు తరిమికొడితే చంద్రబాబు అమరావతిలో వచ్చి పడ్డారని మనం తిప్పికొడితే సింగపూర్ లో పడాలని రోజా పిలుపునిచ్చారు. 

నారాయణ కళాశాలలో చదువుల తల్లులను పొట్టనబెట్టుకున్న నారాయణను మంత్రి పదవి నుంచి తప్పించకుండా కేసులు నమోదు చెయ్యకుండా వారిని కాపాడుతున్నారని తెలిపారు. ఎంతోమంది తల్లుల కడుపుకోత మిగిల్చిన చంద్రబాబును ఇంటికి పంపాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందని రోజా సూచించారు. 

ఏపీలో చంద్రబాబు నాయుడు పతనం తూర్పుగోదావరి  జిల్లా నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 మంది వైసీపీ అభ్యర్థులను, ముగ్గురు ఎంపీ అభ్యర్థులను గెలిపించి ఇక్కడ నుంచే చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఎమ్మెల్యే రోజా సూచించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కాపీ కొడితే డిబార్, చంద్రబాబును ఏం చేయాలి: రోజా