తిరుపతి: తెలుగుదేశం పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ రోజా. వైయస్ జగన్ జనరంజకంగా పాలన అందిస్తుంటే దాన్ని ఓర్వలేక తెలుగుదేశం పార్టీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 

వైయస్ జగన్ వందరోజుల పాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. కృష్ణానదిలో నీళ్లు నిండి రైతులు అంతా హర్షం వ్యక్తం చేస్తుంటే టీడీపీ కడుపుమంటతో పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. 

పల్నాడు ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంటే దానిపై రాజకీయం చేసేందుకు టీడీపీ శిబిరాల స్కీమ్ ను తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావు లాంటి కీచకుల పాలన పోవడంతో అక్కడి ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ రోజా చెప్పుకొచ్చారు.

అంతా ప్రశాంతంగా ఉన్న తరుణంలో చలో ఆత్మకూరు అంటూ వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నించి అభాసుపాలయ్యారని విమర్శించారు. వైసీపీ బాధితుల శిబిరం ఇప్పుడు అవసరం లేదన్నారు. 

అవసరం లేకున్నా వైసీపీ బాధితుల శిబిరం అంటూ నానా హంగామా చేస్తున్న చంద్రబాబు గత ఐదేళ్లుగా కోడెల శివప్రసాదరావు, యరపతినేని శ్రీనివాసరావు, బొండా ఉమా, దేవినేని ఉమా మహేశ్వరరావు, అచ్చెన్నాయుడులాంటి వారి అరాచకాల వల్ల ఎంతో మంది బలైతే ఆ సమయంలో ఎందుకు పునరావాస శిబిరాలు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

నారాయణ కళాశాలల్లో చదువుల సరస్వతులు అన్యాయంగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వారిని పరామర్శించేందుకు ఎందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేదో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. 

పబ్లిసిటీ పిచ్చికోసం గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలితీసుకున్న చంద్రబాబు ఆనాడు ఎందుకు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయలేదో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గ పాలన అంతమెుందించేందుకే వైసీపీకి ప్రజలు అఖండవిజయాన్ని అందించారని తెలిపారు. 

ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తన వైఖరిలో మార్పు తెచ్చుకోవాలని సూచించారు. ఇదేవైఖరితో ముందుకు వెళ్తే రాబోయే ఎన్నికల్లో 23 సీట్లు కాదు కదా ప్రజలు తరిమి తరిమి కొట్టే పరిస్థితి నెలకొంటుందని రోజా హెచ్చరించారు.