విశాఖపట్నం: దళితులపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలను నిరసిస్తూ దళితులు రోడ్డెక్కారు. ఆందోళనలకు దిగారు. 

మరోవైపు చింతమనేని ప్రభాకర్ సైతం ఆందోళన బాట పట్టారు. తన అనుచరులతో కలిసి ఏలూరులో ధర్నాకు దిగారు. దళితుల మనోభావాలను కించపరిచేలా తాను మాట్లాడినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని చింతమనేని ఆరోపించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారంటూ ఆరోపించారు. 

శ్రీరామవరం సభలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి వాటిని వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వీడియోలపై ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చెయ్యాలంటూ పలువురు దళితులు ఆందోళనబాట పట్టారు. 

ఇకపోతే విశాఖపట్నం జిల్లాలో దళితులు ఆందోళనకు దిగారు. చింతమనేని ప్రభాకర్ పై విశాఖపట్నంలోని త్రిటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దళితుల మనోభవాలను కించపరిచేలా చింతమనేని వ్యాఖ్యలు చేశారని అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు విశాఖపట్నంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళనకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మద్దతు పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై నిప్పులు చెరిగారు. 

దళితులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచితంగా మాట్లాడటం ఇదేం మెుదటి సారి కాదన్నారు. దళితులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతోపాటు మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేశారని ఆనాడు అతనిని అరెస్ట్ చెయ్యకుండా సీఎం చంద్రబాబు ఎమ్మార్వోనే ఇంటికి పంపించి సెటిల్మెంట్ చేయించారని ఆరోపించారు. 

ఆ ధైర్యంతో చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోతున్నారంటూ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల పట్ల ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసభ్యకరంగా ప్రవర్తిస్తారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు అండతోనే చింతమనేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేశారన్నారు. నంద్యాల ఉపఎన్నికల్లో మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. 

దళితులు చదువుకోరు, స్నానాలు చెయ్యరు, వీళ్లకి రిజర్వేషన్లు వేస్ట్ అంటూ ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దళితులను ఓటు బ్యాంకు గానే చూస్తుందే తప్ప వారి బాగోగులు పట్టించుకోవడం లేదన్నారు. దళితుల్లో ఎంతోమంది మేధావులుగా ఉన్నారని, రాజ్యాంగాన్ని రచించిన డా.బి.ఆర్ అంబేడ్కర్ కూడా ఒక దళితుడే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. 

ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని అతడ్ని పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలని లేని పక్షంలో భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారంటూ రోజా హెచ్చరించారు.