విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి బోరున విలపించారు. ఈనెల 11న కురుపాం నియోజకవర్గంలోని చినకుదుమ పోలింగ్ బూత్ లో రిగ్గింగ్ చేస్తున్నారన్న ప్రచారంతో తాను తన భర్త వెళ్తే తనపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 

రిగ్గింగ్ జరుగుతుందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తమపై దాడులకు పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడులకు సంబంధించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చెయ్యగా ఎస్సీ ఎస్టీసెల్ డీఎస్పీ పాపారావును విచారణాధికారిగా నియమించారని ఆయన విచారణపై తనకు నమ్మకం లేదన్నారు. 

డీఎస్పీ పాపారావు టీడీపీ ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు కనుసన్నుల్లో నడుస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆయనను విచారణాధికారిగా తప్పించాలని కోరుతూ విశాఖపట్నం రేంజ్ డీఐజీ పాలరాజు, విజయనగరం ఎస్పీలక వినతిపత్రం సమర్పించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తమను 3 గంటలపాటు ఒక ఇంటిలో నిర్భంధించి చిత్రహింసలకు గురి చేశారని చెప్తూ కన్నీటి పర్యంతమయ్యారు. జెడ్పీటీసీ భర్త రామకృష్ణ అతని అనుచరులు మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు డైరెక్షన్లో దాడి చేశారని బోరున విలపించారు. 

తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. శాంతియుతమైన నియోజకవర్గంలో ఇలా భౌతిక దాడులకు దిగడం అనేది బాధాకరమని దాడులు చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు.