నెల్లూరు: ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై నిప్పులు చెరిగారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కన్నా లక్ష్మీనారాయణ అబద్దాల కోరు అంటూ తిట్టిపోశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో కన్నా లక్ష్మీనారాయణ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. 

కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీ విధివిధానాలు కన్నాకు తెలియదని విమర్శించారు. కన్నా లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తికి బీజేపీ రాష్ట్ర పగ్గాలు ఎలా అప్పగించారో అర్థం కావడం లేదని విమర్శించారు. 

బీజేపీ నాయకులంటే తమకు, తమ పార్టీ నేతలకు ఎంతో గౌరవం ఉందన్నారు. అయితే కన్నాలాంటి వ్యక్తుల వల్ల ఆ గౌరవం సన్నగిల్లుతోందని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణకు గుంటూరు జిల్లాలో రౌడీగా పేరుందన్నారు. 

సీఎం వైయస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసచివాలయాలు, గ్రామ వాలంటీర్ల వ్యవస్థలను అపహాస్యం చేస్తూ కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ బీబీ హరిచందన్ కు వినతిపత్రం ఇవ్వడం దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు.  

చంద్రబాబు లాంటి నీచరాజకీయాలు చేసే వ్యక్తితో కన్నా చేయి కలపడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు, కన్నా వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఎవరెన్ని డ్రామాలు ఆడినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని హెచ్చరించారు.

ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఫలితంగా లక్షలాది మంది దళితులకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. చంద్రబాబు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. ఖజానాను ఖాళీ చేసి అప్పుల ఊబిని తమ ప్రభుత్వానికి అప్పగించడం జరిగిందన్నారు. 

చంద్రబాబు నాయుడు ఖజానాను ఖాళీ చేసినప్పటికీ దానిని ఒక సవాల్‌గా స్వీకరించి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ఇతర దేశాల ప్రతినిధులతో పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటుచేసి ఏ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి స్పష్టం చేశారు.