కోవూరు: భక్తుల పాలిట దురుసుగా ప్రవర్తించిన ఆలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. సిబ్బందిని విధుల్లో నుంచి తొలగించాలంటూ ఆలయ ఈవోకి ఆదేశించారు. 

వివరాల్లోకి వెళ్తే కార్తీక సోమవారం సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రం అయిన జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయంలో మహిళా భక్తులు దీపారాధన చేస్తున్నారు. దీపారాధన చేస్తున్న మహిళలపట్ల ఆలయ సిబ్బంది ఒకరు రెచ్చిపోయారు.
 
మహిళలు వెలిగిస్తున్న దీపాలను ఆర్పేశాడు. దాంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీపాలు ఆర్పవద్దని గట్టిగా హెచ్చరించారు. దాంతో ఆలయ సిబ్బంది మరింత రెచ్చిపోయాడు. ఎడికి చెప్పుకుంటావో చెప్పుకోమంటూ గట్టిగా అరవడంతో వీడియో తీసి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి జొన్నవాడ కామాక్షమ్మ దేవాలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ సిబ్బందిని నిలదీశారు. ఇలాంటి వ్యక్తులకు దేవాలయంలో ఉండే అర్హత లేదని హెచ్చరించారు.దీపాలు ఆర్పిన ఆలయ ఉద్యోగిని పూర్తిగా విధుల్లో నుంచి తొలగించాలని ఆదేశించారు. 

ఉద్యోగం చేసే వ్యక్తి ఇలా రౌడీలా వ్యవహరించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడికి చెప్పుకోమంటావో అని అరిచావుగా తనతో చెప్పాలంటూ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిలదీశారు. ఎవర్ని చూసుకుని ఈ ధైర్యం అంటూ తిట్టిపోశారు. 

పవిత్ర పుణ్యక్షేత్రమైన జొన్నవాడ దేవస్థానాన్ని అపవిత్రం చేసేలా, భక్తులకు ఇబ్బందులు తలపెట్టినా ఎవర్నీ సహించేది లేదని హెచ్చరించారు. వెంటనే ఆ సిబ్బందిని తొలగించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవోకు సైతం గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

కామాక్షమ్మ ఆలయాన్ని రక్షించకపోతే ఇక్కడెందుకు అంటూ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని కాపాడేవారే ఇక్కడ అవసరమన్నారు. ఇంకొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఈవోపై సైతం వేటు వేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.