ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీకి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ షాక్‌ తగిలింది. క్రాస్‌ ఓటింగ్‌తో ఆ పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల్లో ఒకరు ఓటమి చెందారు. దీంతో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై అధికార వైసీపీలో విపరీతమైన చర్చ సాగుతుంది.

అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి భారీ షాక్‌ తగిలింది. క్రాస్‌ ఓటింగ్‌తో ఆ పార్టీకి చెందిన ఏడుగురు అభ్యర్థుల్లో ఒకరు ఓటమి చెందారు. దీంతో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై అధికార వైసీపీలో విపరీతమైన చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనై వైసీపీ అధిష్టానం క్రాస్ ఓటింగ్ ఎలా జరిగిందనే దానిపై సమీక్ష చేపట్టింది. అయితే రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు కాకుండా.. మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టుగా భావిస్తునున్నారు. అయితే వారు ఎవరనేది వైసీపీ అధిష్టానం గుర్తించినట్టుగా తెలుస్తోంది. 

ఇదే విషయాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తమ నిఘా వ్యవస్థ ద్వారా క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళను గుర్తించామని చెప్పారు. వారిపై సరైన టైములో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే వారి పేర్లను మాత్రం వైసీపీ అధిష్టానం అధికారికంగా వెల్లడించలేదు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటికీ.. వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలపై క్రాస్ ఓటింగ్‌ పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వారు మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. 

అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టుగా భావిస్తుండగా.. అందులో ఒకరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం మరింత చర్చనీయాంశంగా మారింది. గురువారం రోజున అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత నుంచి ఆయన ఎవరికి అందుబాటులో లేరు. 

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ కూడా స్విచాఫ్‌లో ఉంది. కొందరు ఆయనకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచాఫ్ రావడంతో.. ఆయన ఎక్కడున్నారనేది. నిన్న సాయంత్రం నుంచి ఆయన ఫోన్ స్విచాఫ్ వస్తుందని చెబుతున్నారు. అనుచరులకు కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అందుబాటులో లేరని సమాచారం. ఆయన బెంగళూరుకు వెళ్లారనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారని ఆయనపై వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఇక, వచ్చే ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం కష్టమేనని సీఎం జగన్ స్పష్టం చేశారని.. అందుకే ఆయన అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారనే గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు.. 22 మంది చొప్పున ఎమ్మెల్యేలను కేటాయించగా.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని జయమంగళ వెంకటరమణ గ్రూప్‌లో ఉంచారు. అయితే వెంకటరమణకు తొలి ప్రాధాన్యత ఓట్లు 21 మాత్రమే రావడంతో.. ఒకరు క్రాస్ ఓటింగ్ చేశారని తేలింది. అయితే గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపైనే క్రాస్ ఓటింగ్ చేశారని వైసీపీ వర్గాల్లోనే చర్చ సాగుతుంది.