తాడేపల్లి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అద్భుతమైన పాలన అందిస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధి విధానాలను కన్నా లక్ష్మీనారాయణ పరిశీలిస్తే బాగుండేదన్నారు. నాలుగున్నర నెలల్లోనే గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారా అంటూ మండిపడ్డారు. 

ఈబీసీ రిజర్వేషన్లపై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గత ప్రభుత్వంలో వైఫల్యాలపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. 

బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. వారి వల్లే బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం పారదర్శకమైన ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. 

తాము అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో రెండు నెలలపాటు వర్షాలే కురిశాయని చెప్పుకొచ్చారు. ఈ వాస్తవాలను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుసుకుంటే మంచిదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. 

ఈ వార్తలు  కూడా చదవండి

చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే: జగన్ తీరుపై గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు