స్టేట్ లిస్ట్ ప్రకారం నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి వస్తారని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నిమ్మగడ్డను విచారణకు పిలిస్తే ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కమిటీ విచారణకు వర్చువల్ విధానం ద్వారా హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పిస్తారా అనేది కమిటీ ఛైర్మన్ నిర్ణయమని విష్ణు వెల్లడించారు. 

కాగా, ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ జారీ చేసిన నోటీసులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఈమేరకు శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు శుక్రవారం లేఖ రాశారు.

సభా హక్కులకు భంగం కలిగించారంటూ చేసిన ఆరోపణల్ని ఖండిస్తున్నానని ఎస్ఈసీ పేర్కొన్నారు. శాసనసభ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. తాను ప్రివిలేజ్ కమిటీ విచారణ పరిధిలోకి రానని నిమ్మగడ్డ తన లేఖలో పేర్కొన్నారు.

దీనిపై మరింత ముందుకు వెళ్లాలని భావిస్తే తగినన్ని ఆధారాలు సమర్పిస్తానని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఈ విషయంలో తగినంత సమయం ఇవ్వాలని ఎస్ఈసీ కోరారు. ఇటీవలే కొవిడ్ టీకా తీసుకున్నందున ప్రస్తుతం ప్రయాణాలు చేయలేనని నిమ్మగడ్డ వివరించారు.