40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. జగన్ వై నాట్ అంటే ఏంటో చూడాలనుకుంటున్న బాలయ్యకు ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు.
40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారన్న నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ప్రజల్లో విశ్వాసం, కార్యకర్తల్లో నమ్మకం లేని వారికి జగన్ సీట్లువ్వడనీ, విశ్వాసం లేని ఎమ్మెల్యేల కోసం ప్రభుత్వాన్ని, ప్రజల్ని పణంగా పెట్టనని జగన్ చెప్తున్నారని ఆయన అన్నారు. ప్రజల్లో మమేకమవుతూ, వారి అభిమానాన్ని పొందిన వారికి జగన్ తప్పకుండా సీట్లు ఇస్తాడనీ కొడాలి నాని స్పష్టం చేశారు. తాము సీట్లు ఇవ్వని ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్‌లో ఉంటే మాకేమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఏడాదిలో ప్రజలతో టచ్‌లో ఉంటే సరిపోతుందని కొడాలి నాని పేర్కొన్నారు. బాలయ్య వీర తిలకం దిద్ది పంపిన అల్లుళ్ళను 2019లో ఇంటికి పంపినట్లే.. బావ,బావమరిదిలైన బాలయ్య , చంద్రబాబులను 2024 ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపుతాడనీ నాని జోస్యం చెప్పారు. జగన్ వై నాట్ అంటే ఏంటో చూడాలనుకుంటున్న బాలయ్యకు ఎన్నికల తర్వాత తెలుస్తుందని కొడాలి నాని చురకలంటించారు.
Also Read: టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు, సైకోతత్వం: జగన్ పై బాలకృష్ణ సంచలనం
ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గుడివాడ పర్యటనపైనా కొడాలి నాని స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు నేడు గుడివాడకు వచ్చి కొత్తగా ఏం చెబుతాడని ప్రశ్నించారు. చంద్రబాబు గుడివాడ వచ్చినా.. బెజవాడ వచ్చినా.. రాష్ట్రమంతా తిరిగినా శ్రమ, ఆయాసం తప్ప ప్రయోజనం ఉండదన్నారు. చంద్రబాబు నాయుడు శని గ్రహం లాంటివాడని, ఆయన ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ శని తాండవిస్తుందని, చంద్రబాబు ప్రచారం చేసిన చోట టిడిపి అభ్యర్థి గెలవడని నాని సెటైర్లు వేశారు. నాడు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలను గాలికి వదిలేసిన చంద్రబాబు.. తన కోటరీ ఆస్తుల పెంపకానికే పాటుపడ్డాడని ఆరోపించారు. చంద్రబాబు నైజమేంటో ప్రజలందరికీ తెలుసునని కొడాలి నాని దుయ్యబట్టారు.
