టచ్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు, సైకోతత్వం: జగన్ పై బాలకృష్ణ సంచలనం
వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు వేసే సమయంలో ఆలోచించాలని ఆయన కోరారు. కులాల ఉచ్చులో పడొద్దని ప్రజలకు ఆయన సూచించారు.
అనంతపురం: వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. శుక్రవారంనాడు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సేవ చేయడానికి తమ పార్టీలోకి వస్తే మంచిదేనన్నారు. జనం అంటే జగన్ కు కక్ష, అదో రకమైన సైకోతత్వం అంటూ జగన్ పై బాలకృష్ణ విమర్శలు గుప్పించారు. మీ మీద ప్రేమ ఉందని పొరపాటు పడొద్దని బాలకృష్ణ ప్రజలను కోరారు. జగన్ ది ప్రేమ కాదన్నారు. అదో రకం కక్షసాధింపు చర్యగా బాలకృష్ణ పేర్కొన్నారు. సీఎంకు మెగాబైట్స్, గిగాబైట్స్ అంటే ఏమిటో తెలుసా ? అని ఆయన ప్రశ్నించారు.
తాను సైకాలజీ చదువుకోలేదన్నారు. కానీ మనుషుల సైకాలజీ తెలుసునన్నారు. టీడీపీని గెలిపించుకుందామన్నారు. లేకపోతే ఓటే వేటు అవుతుందని బాలకృష్ణ చెప్పారు. టిడ్కో ఇల్లు ఇచ్చినా వాటిలోకి వెళ్లొద్దని ఆయన ప్రజలను కోరారు. టిడ్కో ఇళ్లలోకి వెళ్తే అవి కూలిపోతాయని బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కులాల ఉచ్చులో పడొద్దని ఆయన సూచించారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని బాలకృష్ణ ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు.
చెత్త మీద కూడా పన్ను వేయడం మన కర్మ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. సలహదారులు అంతా ఒక సామాజికవర్గానికి చెందినవారేనన్నారు,తాను వాస్తవాలు మాట్లాడుతంటానని అందుకే అందరూ తన గురించి మాట్లాడుతుంటారని బాలకృష్ణ చెప్పారు.
. వైసీపీ పాలనలో ఈ రాష్ట్రం ఎటు వెళ్తోందో అర్థం కావడం లేదన్నారు. . రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలంతా కంకణబద్ధులై వైసీపీని ఎదుర్కోవాలని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలందరూ కళ్లు తెరిచి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఆయన కోరారు.
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఏడాదిలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారన్నారు. . నాలుగేళ్లయినా ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని బాలయ్య చెప్పారు. గంజాయిలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆయన విమర్శించారు
రాష్ట్రంలోని మూడు గ్రాడ్యుయేట్స్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో టీడీపీ విజయం సాధించింది . ఈ ఎన్నికల ఫలితాలు టీడీపీలో జోష్ ను నింపాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ ప్రకటించింది. సుమారు 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో టీడీపీ విజయం సాధించడంతో నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వైసీపీ వేటు వేసింది.
రానున్న రోజుల్లో వైసీపీ నుండి తమ పార్టీలో చేరికలు ఉంటాయని టీడీపీ నేతలు ప్రకటించారు . మైండ్ గేమ్ లో భాగంగా టీడీపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేశారా లేదా నిజంగానే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్ లో ఉన్నారా అనే విషయం రానున్న రోజుల్లో తేలనుంది.