అనంతపురం: వరద బాధితులను ఆదుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం తీసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇటీవల వచ్చిన వరదల ధాటికి యాడికి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా సుమారు వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 

వరదల ధాటికి సుమారు రూ.8కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రంగంలోకి దిగారు. వరద బాధితులతో కలిసి భిక్షాటనకు దిగారు. 

ఎమ్మెల్యే భిక్షాటనకు పలువురు మనసున్న మారాజులు స్పందించారు. కాకతీయ కమ్మ సంఘం రాష్ట్ర కార్యదర్శి కాకర్ల రంగనాథ్ రూ.5.72 లక్షలు, సాగర్ సిమ్మెంట్స్ రూ.5లక్షలు, పెన్నా సిమ్మెంట్స్ రూ.5 లక్షలు, వాల్మీకి సేవా సంఘం రూ.75వేలు, తాడిపత్రి ఇండియన్ మెడికల్ అసోషియేషన్ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారు. 

అలాగే పట్టణంలోని పలువురు వ్యాపారులు, వైసీపీ కార్యకర్తలు తమ వంతు సాయం అందజేశారు. ఈ సందర్భంగా వరద బాధితులకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.