హైదరాబాద్‌ : ఏపీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి ఏనాడూ వ్యవసాయం గురించి రైతుల సమస్యల గురించి మాట్లాడిన దాఖలాలు లేవంటూ విరుచుకుపడ్డారు. 

సోమిరెడ్డి ఒక అసమర్థమంత్రి అంటూ విరుచుకుపడ్డారు. కిరాయి మంత్రిగా ఏపీ కేబినేట్ లో పనిచేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎవరిని తిట్టమంటే వారిని తిట్టడానికే ఆయనకు కేబినేట్ లో మంత్రి పదవి కట్టబెట్టారని ఆరోపించారు. 

సోమిరెడ్డి కాదని సోమరిరెడ్డి అంటూ ఘాటుగా విమర్శించారు కాకాణి గోవర్థన్ రెడ్డి. పంటల కాలంలో రైతుల బాగుకోసం పనిచేయని మంత్రి అధికారం ముగిసిపోనున్న తరుణంలో సమీక్షలు చేయడమేంటని నిలదీశారు. 

వ్యవసాయ సీజన్ ఎప్పుడో కూడా చంద్రమోహన్‌రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. తుఫాన్‌ పేరుతో డబ్బులు దొబ్బేయడానికే ఈ డ్రామాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లుగా రైతులకు రుణభారాన్ని పెంచడమే తప్ప వారిని ఆదుకున్న పాపాన పోలేదంటూ తిట్టిపోశారు. 

చివరి సంక్షోభాన్ని కూడా పిండుకోవడానికి సమీక్షల పేరుతో నాటకాలు ఆడుతున్నారంటూ విరచుకుపడ్డారు. చివరి అవకాశం కాబట్టే సమీక్షల పేరుతో చంద్రబాబు సచివాలయానికి వెళ్తున్నారని కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు.